Mana Enadu: సృష్టి.. అనేక వింతలు.. విశేషాలకు నెలవు. చెట్లు, గుట్టలు, పుట్టలు, కొండాకోనలు ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో అదీఇదీ అని కాదు. ఈ సృష్టిలో ప్రతిదీ ఒక అద్భుతమే. ఓ ఆశ్చర్యమే. ఏంటి ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? కొన్నింటి గురించి తెలిసినప్పుడు వావ్.. అంటాం. మరికొన్నింటి గురించి విన్నప్పుడు ఆశ్చర్యపోతుంటాం. ఇంతదంతా ఎందుకు.. సరిగ్గా పాయింట్ చేప్పేస్తే పోలా.. అనుకుంటున్నారా? అవునండీ మీరు పోస్టాఫీస్ గురించే వినే ఉంటారు. అదీ భూమి మీద ఉంటే నార్మల్.. కానీ నీటిపై తేలియాడే పోస్టాఫీస్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు..
ఈ తేలియాడే పోస్టాఫీసును చూడటానికి ఏ దేశం వెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని అందమైన మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఉన్న దాల్ సరస్సులో ఉంది. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే తేలియాడే పోస్టాఫీసుగా నిలిచింది. ఇది తపాలా సేవలను అందించడమే కాకుండా అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తుంది.
1953లో ప్రారంభం
ఈ పోస్టాఫీసు చెక్కతో చేసిన సంప్రదాయ హౌస్‌బోట్‌పై నిర్మించారు. ఇది శ్రీనగర్ సరస్సులలో కనిపించే సాధారణ షికారా పడవను పోలి ఉంటుంది. ఇది స్థానిక ప్రజలకు పోస్టల్ సేవలను అందించడానికి 1953 సంవత్సరంలో ప్రారంభించారు. 1970లో అధికారికంగా ప్రారంభించారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు తమ ప్రియమైన వారికి ప్రత్యేకమైన “ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్, దాల్ లేక్” స్టాంప్డ్ పోస్ట్‌కార్డ్‌లను పంపడానికి ఇష్టపడుతుంటారు.
అంతేకాదు పోస్టాఫీసు లోపలికి వెళ్లి జాగ్రత్తగా చూసి, దాని చరిత్ర గురించి తెలుసుకోవడం కూడా పర్యాటకులను ఆనందాన్ని కలిగిస్తుంది. అంతే కాదండోయ్.. అంతర్జాతీయ ఫోన్ కాల్స్ చేసుకునే సదుపాయం కూడా ఇక్కడ ఉంది. ఈ సారి ఎప్పుడైనా మీరు కూడా శ్రీనగర్ వెళితే తప్పుకుండా ఈ పోస్టాఫీస్‌ను సందర్శించి, మీకు ఇష్టమైన వారికి ఓ లెటర్ రాసి పంపించండి.