Mana Enadu: దేశంలో కోల్‌కతా టైనీ డాక్టర్ అత్యాచారం, హత్య (Trainee doctor case) కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్దయెత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అటు బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో వైద్యులు, జూనియర్ డాక్టర్లు ఓపీ(OP) సేవలు కూడా నిలిపివేశారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు చేపట్టిన CBI అధికారులు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే జుడీషియల్ రిమాండ్‌లో ఉండి కేసు విచారణను ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ జైలు సిబ్బంది పెట్టే ఆహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిబ్బంది రోజూ రోటీ సబ్జీ ఇస్తుండటంపై సంజయ్ ఒకింత కోపం వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘రోజూ రోటీలేనా.. నాకు ఎగ్ నూడుల్స్ కావాలి’ అని రాయ్ డిమాండ్ చేసినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.
నోరు మూసుకొని పెట్టింది తీసుకోమన్నారు
అయితే జైలు సిబ్బంది గట్టిగానే స్పందించారు. జైల్లో అందరికీ ఒకే ఆహారం ఇస్తామని, నీ కోసం ప్రత్యేకంగా అడిగింది తెచ్చివ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో సంజయ్ నోరు మూసుకుని పెట్టిన ఆహారం తీసుకున్నట్లు జాతీయ మీడియా సంస్థ తెలిపింది. కాగా కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రెయిన్ డాక్టర్‌పై అత్యాచారం చేసి, కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటనలో సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు ఈ కేసులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(CM Mamata Benarjee) బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని జూనియర్ వైద్యులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.
ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన ఇలా..
కోల్‌కతా(Kolkata)లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు(Trainee doctor case) ఇప్పట్లో తేలే లా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్(Sanjay Roy) రూట్ మార్చినట్లు తెలుస్తోంది. విచారణలో గతంలో తానే చేశానని పోలీసులు చెప్పగా, ఇప్పుడు మాత్రం ఈ హత్యకు తనకు సంబంధం లేదని, ఇరికిస్తున్నారని చెబుతున్నాడు. నిందితుడు సంజయ్ రాయ్‌ను కస్టడీ నేపథ్యంలో ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌లోని సెల్ నంబర్ 21లో ఉంచారు. కాగా ఆగస్టు 9న ఉదయం కోల్‌కతాలోని RG కర్ హాస్పిటల్‌లో(RG Kar Medical College and Hospital) 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మహిళా డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ఆమెను అత్యాచారం చేసి తర్వాత హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఈ దారుణ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు స్వయంగా సుమోటాగా స్వీకరించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.