Mana Enadu: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో విధుల్లో 300 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఫస్ట్ ఫ్లోర్‌లో పైకప్పు కూలడంతో కొందరు చిక్కుకున్నట్లు కార్మికులు తెలిపారు. పేలుడు ధాటికి సిబ్బంది శరీర భాగాలు ఛిద్రమైనట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పంపించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు రియాక్టర్ పేలుడు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఆ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. ఘటనకు గల వివరాల అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
అచ్యుతాపురం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రియాక్టర్ పేలిన భవన శిథిలాల కింద పలు మృతదేహాలు ఉన్నాయని తోటి కార్మికులు చెబుతున్నారు. శిథిలాలు తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 12 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. మరోవైపు కంపెనీ వద్ద కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని డ్యూటీలో ఉన్న సిబ్బంది వివరాలు బయట పెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం కెమికల్ పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులతో పరిశ్రమల ప్రాంగణం నిండిపోయింది.