Mana Enadu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర(AndhraPradesh) వ్యాప్తంగా వైరల్జ్వరాలు(Viral fevers) పంజా విసురుతున్నాయి. దీంతో ప్రభుత్వాసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దాదాపు 1,155 పడకలున్న కాకినాడ ప్రభుత్వాసుపత్రికి(Kakinada Government General Hospital) 2వేల మందికి పైగా వచ్చి చేరారు. దీంతో కొన్ని వార్డుల్లో ఒక్కో మంచం మీద ఇద్దరిని పడుకోబెట్టారు. మరికొందరు పేషెంట్లకు నేలమీద కూడా పడుకోబెట్టి చికిత్స చేయాల్సి వస్తోంది. జ్వరాలతో ఎక్కువ కేసులు రావడమే ఈ పరిస్థితికి కారణమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.లావణ్య కుమారి చెప్పడం గమనార్హం.
బ్లడ్ టెస్ట్, MRI స్కానింగ్ యంత్రాలూ అంతే..
ఇదిలా ఉండగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం 1500 నుంచి 2000 మంది వరకు రోగులు వస్తుంటారు. అందులో దాదాపు సగం మంది ఆసుపత్రిలో ఉండి వైద్య సేవలు పొందుతుంటారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ మన్యం వాసులూ అత్యవసర వైద్య సేవలకు కాకినాడ GGHనే ఆశ్రయిస్తుంటారు. అలాంటి కీలకమైన ఈ ఆసుపత్రి నిర్లక్ష్యంతో సమస్యల నిలయంగా మారింది. కొన్ని నెలలుగా రక్త పరీక్షల పరికరాలు, థైరాయిడ్, MRI Scanning యంత్రాలు పని చేయక రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్(Private) స్కానింగ్ సెంటర్లలో రూ.వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని, దీంతో తాము తీవ్ర అవస్థలు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులకు విన్నవించాం..
మరోవైపు బ్లడ్ టెస్ట్‌లు చేసే ల్యాబ్‌లో మెషీన్లు(Lab machines) మెురాయించి నెలలు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడని రోగులు వాపోతున్నారు. చిన్న పిల్లల వార్డులో పాడైన వెంటిలేటర్లు, వార్మర్స్ ఫొటోథెరఫీ పరికరాలకు మరమ్మతులు కూడా చేయడం లేదని చెప్పారు. మాతా శిశు విభాగంలోని మూడు యూనిట్లలో180 పడకలు అందుబాటులో ఉండగా… ఒక మంచంపై ఇద్దరు, ముగ్గురిని ఉంచి వైద్యం అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.లావణ్య కుమారిని ప్రశ్నించగా సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు.