Mana Enadu:ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లో ఎన్నికలకు ముందు, ఆ తర్వాత హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గం పిఠాపురం(Pithapuram). పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అక్కడ పోటీ చేయడంమే ఇందుకు కారణం. అంతేకాదండోయ్.. అక్కడ పవన్ గెలుపు కోసం సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వరుస బెట్టీ మరీ సభ, ప్రసంగాలు నిర్వహించారు. అందుకు తగ్గట్లే పిఠాపురంలో పవన్ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత పవన్ రేంజ్ ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం(DeputyCM)తో పోస్టుతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర& సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అనుభవం తక్కువే అయినా..
రాజకీయ అనుభవం కాస్త తక్కువే ఉన్నా.. తన ముందుచూపుతో బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టున్న పవన్ ఇప్పుడు పిఠాపురంలో తన స్థానం పదిలం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే ప్రత్యర్థి పార్టీల్లోని నేతలను ఆకర్షిస్తున్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు(Dorababu)ను జనసేనలో చేర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన పవన్.. మాజీ ఎమ్మెల్యే వర్మ(Varma)తో ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థిని కలిపి నయా రాజకీయానికి తెరతీస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
పవన్ సూచనతో
పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఎన్నికైన నాటి నుంచి అక్కడ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. తన గెలుపు కోసం విశేషంగా కృషి చేసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు పవన్. వర్మను అవమానించేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఇదివరకే గట్టి సందేశమిచ్చారు. ఇక పిఠాపురం అభివృద్ధి కోసం వర్మ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. వర్మ కూడా పవన్ నాయకత్వానికి మద్దతుగా.. పవన్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తాజాగా పవన్ సూచనతో రెండు దశాబ్దాలుగా రాజకీయ యుద్ధం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతోనూ చేతులు కలిపేందుకు వర్మ సిద్ధమవడమే గోదావరి తీరంలో ఆసక్తి రేపుతోంది.

కారణం అదేనా..
ఈ ఇద్దరికీ ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం రాలేదు. పొత్తుల్లో భాగంగా జనసేనాని పవన్‌కు మద్దతుగా వర్మ పోటీ నుంచి తప్పుకుంటే.. ఎమ్మెల్యేల మార్పుల్లో భాగంగా తొలివేటు దొరబాబుపైనే వేసింది వైసీపీ. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేని దొరబాబు… ఎన్నికల ముందే వైసీపీని వీడతారనే ప్రచారం జరిగింది. ఇక ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు దొరబాబు.

పిఠాపురంలో అదే వ్యూహం
పిఠాపురంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే వ్యూహంతో పవన్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసమే మాజీ ఎమ్మెల్యే దొరబాబు జనసేనలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన అనుచరులు కూడా భారీగా చేరే అవకాశం ఉండటంతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన బలమైన శక్తిగా ఆవిర్భవించనుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే వైసీపీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకునే విషయంలో కూటమి పార్టీలు మూడూ చర్చించుకోవాలని గతంలో నిర్ణయించాయి. ఈ పరిస్థితుల్లో పిఠాపురంలో బడా నేతలు అంతా ఎలా ముందుకు వెళతారన్నదే ఆసక్తికరంగా మారింది.