గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ

ManaEnadu:తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని వెల్లడించారు.  మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు నిరుద్యోగులకు తీపికబురు అందించారు.

యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్‌ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు ‘రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ పేరిట రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రేవంత్‌రెడ్డి ఆ చెక్కులు అందజేశారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 135 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున అందించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్‌ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నాను. సివిల్స్‌ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలి. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తాం. చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్‌ ఇండియా వర్సిటీ ద్వారా 2వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తాం. అంతేకాకుండా యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తాం.

2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 10, 15 రోజుల్లో అన్ని వర్సిటీలకు నూతన వైస్‌ ఛాన్సలర్లను నియమిస్తామని ప్రకటించారు. వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని.. కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

Share post:

లేటెస్ట్