CM| ఈ వారంలోనే మరో రెండు పథకాలు..సీఎం రేవంత్​ రెడ్డి కీలక ప్రకటన

 

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మరో రెండు పథకాలను ప్రారంభించబోతున్నట్లు మేడారం జాతర వేదికగా ప్రకటించారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా వాటిని ప్రారంభిస్తామని తెలిపారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారం జాతర (Medaram Jathara)కు వెళ్లారు. మధ్యాహ్నం సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆయన.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో… మరో రెండు పథకాలను ప్రారంభించబోతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈనెల 27 సాయంత్రం రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాలను ప్రారంభిస్తామని చెప్పారు.

ఉచిత విద్యుత్, సిలిండర్‌ పథకాల ప్రారంభానికి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ రెండు పథకాలను ప్రారంభిస్తారు. అందుకోసం కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 89.99 లక్షల మందికి రేషన్ కార్డులున్నాయి. ప్రాథమిక అంచనా మేరకు.. ఇందులో ప్రస్తుతం 39.50 లక్షల మందిని మాత్రమే సబ్సిడీ గ్యాస్‌ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.

అర్హులైన వినియోగదారులకు ఫిబ్రవరి 27 సాయంత్రం నుంచి రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తారు. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత అర్హుల సంఖ్య మరింత పెరగవచ్చు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇక ఉచిత విద్యుత్ పథకం కోసం కూడా ఇప్పటికే ఇంటింటి సర్వే జరుగుతోంది. విద్యుత్ బిల్లు తీసే సిబ్బంది.. ఇంటి యజమాని ఆధార్ కార్డు, రేషన్ కార్డుల వివరాలను తీసుకున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి..మార్చి నుంచి జీరో బిల్లులను ఇస్తారు.

 

Share post:

లేటెస్ట్