Mana Enadu:గాల్లోకి ఎగిరేస్తే.. ఆకాశాన్ని అందుకున్నంత సంతోషం.. అదనంత దూరంలో ఉన్నా చందమామతో ఆడుకోవాలనే అల్లరి.. ఇవన్నీ బాల్యంలో లభించే మరిచిపోలేని జ్ఞాపకాలు.. తిరిగిరాని మెమోరీస్. అయితే ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన వయసులో వివిధ కారణాల వల్ల కొందరు బాలబాలికలు కార్మికులుగా మారుతున్నారు. ఇందుకు పేదరికం ప్రధాన కారణమైతే, తల్లిదండ్రులు లేకపోవడం.. పట్టించుకోకపోవడం వంటి కారణాలు మరికొన్ని. పసి ప్రాయంలోనే కొందరు వయస్సుకు మించిన పనులు చేస్తూ, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. అలాంటివారి కోసమే కేంద్రం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ‘ఆపరేషన్ ముస్కాన్’ను ప్రారంభించింది.
3000 మంది చిన్నారులను రక్షించారు..
జులైలో తెలంగాణ పోలీసులు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో 3,076 మంది చిన్నారులను రక్షించారు . వారిలో 2,772 మంది బాలురు, 304 మంది బాలికలు ఉన్నారు. 2,856 మంది పిల్లలు వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. రక్షించబడిన 934 మంది పిల్లలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందినవారు. అలాగే 47 మంది వీధి పిల్లలు, 115 మందిని భిక్షాటన నుంచి రక్షించారు. బాల కార్మికులుగా వివిధ చోట్ల పనిచేస్తోన్న 2,510 మంది బాలలను రక్షించినట్లు మహిళా భద్రత అదనపు డీజీపీ శిఖా గోయెల్ తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం మహిళా భద్రతా విభాగం నోడల్ ఏజెన్సీ, 120 సబ్-డివిజనల్ పోలీసు బృందాలలో 676 మంది సిబ్బంది పనిచేశారని ఆమె వివరించారు.
విస్తృతంగా తనిఖీలు
గత నేరాలు, నియంత్రణ లేని పారిశ్రామిక యూనిట్లు, ఇటుక బట్టీలు మరియు పిల్లలను అక్రమంగా నియమించుకున్న ప్రదేశాల విశ్లేషణ ద్వారా ఈ బృందాలు హాని కలిగించే ప్రాంతాలను గుర్తించాయి. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు, ట్రాఫిక్ జంక్షన్లు, మెకానిక్ దుకాణాలు, ఇటుక పరిశ్రమలు, నిర్మాణ స్థలాలు, దుకాణాలు, టీ స్టాల్స్, ఫుట్‌పాత్‌లు వంటి ప్రదేశాలలో రెస్క్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించాయి.
25 డివిజన్‌ల్లో.. 25 ప్రత్యేక టీమ్స్
ఇదిలా ఉంటే ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 డివిజన్‌ల్లో.. 25 ప్రత్యేక టీమ్స్ పని చేస్తున్నాయి. చైల్డ్ హెల్ప్ లైన్, రెవెన్యూ శాఖ, ఎడ్యుకేషన్, హెల్త్, చైల్డ్ వెల్ఫేర్, కార్మిక శాఖల సిబ్బందితో పాటు పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులను ఈ టీమ్స్‌లో భాగం చేశారు. ఎవరైనా బాలకార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే, 1098, 100కు ఫోన్ చేయడం కానీ లేదా లోకల్పోలీసులకు సమాచారం ఇవ్వాలని పౌరులను పోలీసులు కోరుతున్నారు.