ManaEnadu: EC to Announce Election Schedule Today : దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ఓట్ల పండుగ. లోక్ సభ ఎన్నికలతో పాటు.. మరో 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కాబోతోంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్ లో జరిగే విలేకరుల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్, మరో ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధులతో కలిసి 18వ లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఒక ప్రకటనను విడుదల చేశారు.
గతంలో సార్వత్రిక ఎన్నికలు దశల వారిగా నిర్వహించిన విషయం తెలిసిందే. 2004లో 4 దశలు, 2009లో 5, 2014లో 9, 2019లో 7 దశలలో ఎన్నికలు జరిగాయి. మరి ఈ సారి ఎన్ని దశలలో ఎన్నికలు నిర్వహిస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2019లో ఎన్నికల షెడ్యూల్ మార్చి 10వ తేదీన విడుదలవ్వగా.. ఈసారి ఆరు రోజులు ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. ఎన్నికల కమిషనర్ల మార్పు కారణంగానే షెడ్యూల్ ఆలస్యమైంది. షెడ్యూల్ మధ్య ఉన్న తేడానే.. పోలింగ్ తేదీల్లో కూడా ఉండొచ్చని తెలుస్తోంది.
చివరిగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11తో మొదలై.. మే 19వ తేదీతో ముగిశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు తొలిదశలో జరుగగా.. మే 23న ఓట్లను లెక్కించారు. 2014లో 16వ లోక్ సభ ఎన్నికలను 9 దశల్లో నిర్వహించింది ఈసీ. ఏప్రిల్ 7న మొదలైన ఎన్నికలుమే 12వ తేదీతో ముగిశాయి. ఇక 2009లో 5 దశలలో సాగిన ఎన్నికలు ఏప్రిల్ 16న ప్రారంభమై.. మే 13వ తేదీతో ముగిశాయి. 2004లో 4 దశలలో జరిగిన ఎన్నికలు ఏప్రిల్ 20వ తేదీన మొదలైన మే 10వ తేదీతో ముగిశాయి. రాష్ట్ర విభజనకు ముందు.. 2004,2009 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి, మలి దశల్లో ఎన్నికలు నిర్వహించారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు తొలిదశలోనే పూర్తి చేసింది ఈసీ. 2024లో ఏపీ, తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ఎన్నిదశలలో ఉంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది.