Ganesh Chaturthi 2024: ఏకదంతుడి ఉత్సవం.. వేడుకగా చేద్దామిలా!!

ManaEnadu: ‘‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ:
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా!!”
అంటూ మనం ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టాలన్నా మొదట పూజించేది గణపతినే. సకల శుభాలకు మూలం ఆ గణనాథుడే( Lord Bappa) అని భక్తుల నమ్మకం. విఘ్నేశ్వరుడినికి భగవంతుడికి భక్తే ప్రధానం. ఖరీదైన సేవలేం అవసరం లేదు. పత్రాలు సమర్పించినా దేవుడు సంతృప్తి చెందుతాడు. అందుకే భగవద్గీతలో ‘పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి’ అని పేర్కొన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఏటా వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్నాపెద్దా, ఊరూవాడ అని తేడా లేకుండా అంతా ఒక్కటై ఆ లంబోదరుడిని ప్రతిష్ఠిస్తారు. హిందువులు ఘనంగా, వేడుకగా నిర్వహించుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఇది వస్తుందంటే వీధి వీధి వినాయక మండపాలతో నిండిపోతుంది. గ్రామాలు, పట్టణాలు గణపతి బప్పా మోరియా అని మారుమోగిపోతాయి.

 గణనాథుడి పూజకు కావాల్సినవి ఇవే..

అయితే వినాయకుడి చవితి(Ganesh Chaturthi) పూజకు ఆయనకు ఇష్టమైనవన్నీ సమకూర్చాలని భక్తులు తాపత్రయ పడుతుంటారు. అయితే పూజకు(puja samagri) కావాల్సిన సామగ్రి అంతా సమకూర్చుకున్నా ఒక్కోసారి కొన్ని మర్చిపోతూ ఉంటాం. పూజకు కావాల్సినవి ఏంటంటే.. పసుపు, కుంకుమ, పూలు, పూలదండలు, తమలపాకులు, వక్కలు, కర్పూరం, అగరబత్తులు, గంధం, అక్షింతలు, అరటిపండ్లు, కొబ్బరికాయ, బెల్లం, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి, వత్తులు, వినాయకుడి ప్రతిమ, పంచామృతం, పత్రి, ఉండ్రాళ్లు, మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలు. వీటితోపాటు పత్రిగా పిలుచుకునే 21 రకాల ఆకులు కూడా ఉండాలి. చాలా చోట్ల ఇప్పుడు ఈ 21 రకాల ఆకులు దొరకడం లేదు కొన్నింటిని మాత్రమే పెట్టి పూజిస్తున్నారు. వీలైతే మీరు ఈ 21 రకాల ఆకులను సేకరించండి. అవేంటంటే మాచీ పత్రం, బృహతీ పత్రం (ములక), బిల్వపత్రం అంటే మారేడు ఆకు, దూర్వా పత్రం అంటే గరిక, దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు, బదరీ పత్రం అంటే రేగు ఆకులు, అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకులు, తులసి పత్రం, మామిడి ఆకులు, గన్నేరు ఆకులు, విష్ణుక్రాంత ఆకులు, దానిమ్మ ఆకులు, దేవదారు ఆకులు, మరువం, సింధువార పత్రం అంటే వావిలి పత్రం, సన్నజాజి ఆకులు, లతా దుర్వా అని పిలిచే గండలీ పత్రం, శమీపత్రం, రావి ఆకులు, మద్ది చెట్టు ఆకులు, జిల్లేడు ఆకులు.

 ఏ సమయంలో జరుపుకోవాలంటే..

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు. అయితే ఈ ఏడాది చవితి తిథి సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఉంటుందని పండితులు తెలిపారు. అయితే ధృక్ సిద్ధాంతం ప్రకారం 7నే (శనివారం) వినాయక చవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉ.11.03 గంటల నుంచి మ.1.30 గంటల మధ్యలో గణేశుడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం(shubh muhurat) ఉందని పేర్కొన్నారు. సాయంత్రం 6.22 గంటల నుంచి రా.7.30 మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే వినాయకుడికి ఎరుపు రంగు వస్త్రాలంటే ప్రీతిపాత్రమని.. పండగ రోజున ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.

 

Share post:

లేటెస్ట్