ManaEnadu:హురున్ ఇండియా సంపన్నుల జాబితా (Hurun India Rich List 2024) 2024 విడుదలైంది. ఈ జాబితాలో దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మొదటిస్థానాన్ని సంపాదించారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలతో భారీగా ఆస్తి కోల్పోయిన గౌతమ్ అదానీ (Gautam Adani) రాకెట్ వేగంతో బౌన్స్ బ్యాక్ అయి భారత్‌లోని అపర కుబేరుల జాబితాలో మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.
ఫస్ట్ అదానీ.. సెకండ్ అంబానీ..
హురున్ జాబితా ప్రకారం ఏడాది కాలంలో 95 శాతం పెరిగిన సంపదతో రూ.11.61 లక్షల కోట్లతో అదానీ అగ్రస్థానంలో నిలిచారు. రూ.10.14 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానం దక్కించుకున్నారు. ఏడాది కాలంలో ఆయన సంపద 25 శాతం పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. హెచ్‌సీఎస్ ఛైర్మన్ శివ నాడార్ (Shiv Nadar) రూ.3.14 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో, సీరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా (Cyrus S. Poonawalla) రూ.2.89 లక్షల కోట్ల ఆస్తితో నాలుగో స్థానంలో నిలిచారు. రూ.2.50 లక్షల కోట్ల సంపదతో సన్‌ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ ఐదో స్థానంలో ఉన్నారు.
జాబితాలో షారుక్ ఖాన్..
ఇక ఈ జాబితాలో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. హురున్ లిస్టులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) తొలిసారి చోటు దక్కించుకున్నారు. షారుక్ సంపద రూ.7,300 కోట్లు ఉన్నట్లు హురున్ నివేదిక తెలిపింది. జెప్టో వ్యవస్థాపకుడు (kaivalya vohra) 20 ఏళ్ల కైవల్య వోహ్రా రూ.4,300 కోట్ల సంపదతో అతి పిన్న వయసులో బిలీయనీర్ జాబితాలో చోటు దక్కించుకుని అరుదైన ఘనతను ఆయన సాధించారు. మరోవైపు హురున్ బిలియనీర్ జాబితాలో జోహో కంపెనీకి చెందిన రాధా వెంబు రూ.47,500 కోట్ల సంపదతో మహిళల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు.







