Mana Enadu: తెలంగాణలో రాజకీయం మొత్తం ఇప్పుడు హైడ్రా మీదకు మళ్లింది. ఎవరి నోట విన్నా హైడ్రా ముచ్చటే. రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గేదే లేదన్నట్లు అక్రమ కట్టడాలు కూల్చివేస్తూ వస్తోంది. తాజా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూడా నేలమట్టం చేసింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంలో ఏ ఒత్తిడీ తమను అడ్డుకోలేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తెలంగాణలో ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీలకు కొత్త సారథుల నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతకీ ఆ పార్టీలేంటి.. ఓ సారి చూద్దామా..
ఎటు తేల్చుకోలేని రెండు పార్టీల అధిష్ఠానాలు
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నియామకంలో ఆయా పార్టీ అధిష్ఠానాలు దోబూచులాడుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకం తర్వతే కలమదళం సారథిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తుండగా.. బీజేపీ, బీఆర్‌ఎస్ పొలిటికల్ స్టెప్స్ పరిశీలించి… ఆ పార్టీల యాక్టవిటీస్‌పై ఓ అంచనాకు వచ్చాకే పీసీసీ బాస్ ఎవరన్నది తేల్చాలని కాంగ్రెస్ తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల రేవంత్ ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలను కలిసిన తర్వాత రెండు రోజుల్లో పీసీసీ చీఫ్‌పై తేల్చేస్తామని చెప్పినా మరో ఏడాదిపాటు సీఎం రేవంత్‌రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆచితూచి వ్యవహరిస్తోన్న బీజేపీ
మరోవైపు బీజేపీ సైతం రాష్ట్ర సారథి ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించిన తర్వాతే బీజేపీ కొత్త సారథిని ఎంపిక చేయాలనే ఆలోచనతో ఆ పార్టీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు కొత్త సారథులు నియమించకపోయినా పోయేదేం లేదన్నట్లూ ఆయా పార్టీల పెద్దలు ఉన్నట్లు టాక్. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తప్ప మరే ఎలక్షన్స్ లేవు. కానీ రెండు పార్టీల్లోనూ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలు ఒకరు సీఎంగా, మరొకరు కేంద్ర మంత్రిగా అధికార విధుల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలు వెనకబడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రెండు పార్టీలు తెలంగాణ సారథులపై తేల్చుకోలేకే వాయిదాలపై వాయిదాలు వేస్తున్నట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.