Mana Enadu:పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఒలింపిక్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ గుండె పగిలింది. కోట్ల మంది భారతీయులను ఆవేదనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో మన భారత బిడ్డకు అండగా యావత్ భారతావని నిలుస్తోంది. నీకు మేమున్నాం వినేశ్ అంటూ మన ఆడబిడ్డలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది.
వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందిస్తూ.. పారిస్ ఒలింపిక్స్‌లో ఫొగాట్ అసాధారణ ప్రతిభ కనబరిచారని అన్నారు. తన ప్రతిభతో దేశం గర్వపడేలా చేశారని.. ఆమెకు అందరూ అండగా నిలవాలని కోరారు. 140 కోట్ల ప్రజల హృదయాల్లో ఫొగాట్ ఛాంపియన్‌గా నిలిచారని.. భవిష్యత్తు క్రీడాకారులకు ఫొగాట్ ఆదర్శంగా నిలుస్తారని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై స్పందిస్తూ వినేశ్ మీరు ఛాంపియన్ అంటూ ఆమెలో ధైర్యాన్ని నింపారు. మరోవైపు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా వినేశ్‌కు అండగా నిలుస్తూ.. ఆమె కోసం ప్రపంచమంతా ప్రార్థిస్తోందని అన్నాడు. ‘‘నువ్వు ఈ భరతమాత్ర బిడ్డవి. అందుకే చాలా ధైర్యంగా పోరాడావు. నిన్నంతా బాగానే ఉంది. ఇవాళ 100 గ్రాముల అధిక బరువు వచ్చిందంటున్నారు. నాతో సహా ఇవాళ జరిగిన విషయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. యావత్ దేశం దుఃఖమయమైంది. అన్ని దేశాల మెడల్స్ ఒక ఎత్తయితే.. నీ మెడల్ ఒక ఎత్తు. ఇప్పుడు ప్రపంచమంతా నీకోసం ప్రార్థిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మహిళా రెజ్లర్లంతా వినేశ్‌కు అండగా ఉంటారని ఆశిస్తున్నా’’ అని బజరంగ్ పునియా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు.
మరోవైపు ఒలింపిక్ గోల్డ్ విన్నర్, మాజీ షూటర్ అభినవ్ బింద్రా మాట్లాడుతూ.. ప్రజలకు నిజమైన ఛాంపియన్‌గా ఉండటానికి కొన్ని సార్లు బంగారు పతకమే అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇక స్టార్ షట్లర్ పీవీ సింధు వినేష్ గురించి మాట్లాడుతూ.. ‘డియర్ వినేశ్.. మాకు నువ్వెప్పటికీ ఛాంపియన్‌వే. ఈ ఒలింపిక్స్‌లో తప్పకుండా స్వర్ణం సాధిస్తావని బలంగా నమ్మా. నీతో ఉన్న కొద్ది సమయంలోనే నేనెంతో స్ఫూర్తి పొందా. ఎల్లప్పటికీ మద్దతుగా ఉంటా’ అని ట్వీట్ చేశారు.
“ఇది చాలా దురదృష్టకరం. వినేశ్‌కు అన్యాయం జరిగింది. ఇదేం తొలి రౌండ్ కాదు. వరల్డ్ మెడల్ సాధించే మ్యాచ్. దీన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వద్ద భారత్ తమ నిరసనను బలంగా వినిపించాలి. ” – టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్