ManaEnadu:ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ముందుంటుందని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. చిత్ర పరివ్రమలోని అన్ని విభాగాలు కలిసి సాయం చేసేందుకు ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘‘విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలా మంది బాధ పడుతున్నారని అన్నారు. విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్(Telugu film producers) తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు, అలాగే ఫెడరేషన్ తరపున చెరో 5 లక్షలు విరాళంగా ప్రకటించారు.
సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ..ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుందన్నారు. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తామన్నారు. మా కుటంబం నుంచి కోటి రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ..వరద బాధితులకు చాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మా నిర్మాణ సంస్థ నుంచి రెండు రాష్ట్రాలకు చెరో పాతిక లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు.
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ..‘‘రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒకరోజు వేతనం ఇచ్చేందుకు ముందుకొచ్చామన్నారు. మా కార్మికుల తరపున తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..‘‘వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుందన్నారు
ఈ ప్రెస్ మీట్‌లో భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, అనిల్, అమ్మిరాజు, భరత్ చౌదరి పాల్గొన్నారు.