నా సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆయన కాల్ చేయగానే.. ఏడుపొచ్చింది: పూరీ జగన్నాథ్‌

Mana Enadu:టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్టైలే వేరు. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, బిజినెస్​మెన్ ఈ సినిమాలు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశాయి. బ్లాక్ బస్టర్ హిట్లతో పూరీ రేంజ్ టాలీవుడ్​లో ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ చాలా రోజుల నుంచి ఆయనకు సరైన హిట్ పడలేదు. వరుస ఫ్లాప్​లు వెంటాడుతున్నాయి. ఫ్లాపుల్లో కూరుకుపోయిన పూరీకి పోతినేని రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మళ్లీ జోష్​ను ఇచ్చింది. ఇక ఈ డైరెక్టర్ మళ్లీ ట్రాక్​లోకి వచ్చాడనుకుంటుండగానే మళ్లీ లైగర్​తో మరో ఫ్లాప్​ను మూటగట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ రామ్​తోనే ఇస్మార్ట్ శంకర్​కు సీక్వెల్​గా డబుల్ ఇస్మార్ట్​తో ముందుకొస్తున్నాడు. మరి పూరీని మళ్లీ రామ్ రక్షిస్తాడో లేదో తెలియాలంటే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదలయ్యే వరకు చూడాల్సిందే.

ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా హనుమకొండలోని జె.ఎన్‌.ఎస్‌. స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్​లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ తన లైఫ్​లో సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భంలో చోటుచేసుకున్న ఓ సంఘటన గురించి చోటుచేసుకున్న విషయాన్ని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. హిట్ సినిమా తీస్తే చాలా మంది ప్రశంసిస్తారని.. కానీ తన సినిమా ఫ్లాప్ అయిన సందర్భంగా ఓ గొప్ప వ్యక్తి నుంచి తనకు కాల్ వచ్చిందని పూరీ చెప్పారు. ఆ కాల్ చేసింది ఎవరో కాదు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్. ఇంతకీ ఆయన కాల్ చేసి పూరీతో ఏమన్నారో తెలుసా..?

‘‘ నాకు విజయేంద్ర ప్రసాద్ కాల్ చేశారు. ఆయన నన్ను నెక్స్ట్ మూవీ ఎప్పుడు చేస్తున్నారని అడిగారు. ఎప్పుడు సినిమా చేయాలనుకున్నా ముందుగా కథ నాకు చెప్పండని అడిగారు. ‘మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్‌ అవ్వడం నేను చూడలేను. అందుకే మీరు సినిమా చేసే ముందు కథ నాకు చెబితే.. మీరు చేసే చిన్న చిన్న తప్పులను నేను సరిదిద్దడానికి కాస్త సాయపడతాను. అందుకే తీసే ముందు నాకు ఒక్కసారి చెప్పండి’ అని అన్నారు. ఆయన మాటలతో నాకు ఏడుపొచ్చింది. నాపై అభిమానంతో చేసిన ఆ కాల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. అయితే, ఈ డబుల్ ఇస్మార్ట్ గురించి ఆయనకు చెప్పలేదు. జాగ్రత్తగా తీసి, ఆయనకు సినిమానే చూపించాలనుకున్నా’’ అని పూరీ జగన్నాథ్ చెప్పారు. ఇక గతంలో ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్.. తన ఫేవరెట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అని చెప్పారు. తన మొబైల్ వాల్ పేపర్ కూడా పూరీదే ఉంటుందని చూపించారు కూడా.

 

Share post:

లేటెస్ట్