ManaEnadu: ‘కమిటీ కుర్రోళ్ళు’.. ఆగస్టు 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో ఆమె బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్, ల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందింది. యంగ్ డైరెక్టర్ యదు వంశీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో దాదాపు 19 మంది కొత్త కుర్రాళ్లు నటించారు.
తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. కమిటీ కుర్రోళ్లు సినిమాలో నటీనటులందరూ కథానుగుణంగా మేకోవర్ అవ్వడమే కాకుండా, చక్కగా నటించారని అన్నారు. తాజాగా సినిమా చూసిన చిరంజీవి చిత్ర బృందాన్ని పిలిచి అభినందించారు.
” ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం చూశాను. సినిమా చాలా బాగుంది. అందరూ కొత్త కుర్రాళ్లే అయినా బాగా నటించారు. సినిమా చూస్తున్నంత సేపు కొత్త వాళ్లను చూసిన ఫీలింగే రాలేదు. ఇందులో ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. నటీనటులంతా కథ ప్రకారం మేకోవర్ అయిన తీరు అద్భుతంగా ఉంది. సినిమా నేచురల్ గా వచ్చింది. దానికోసం చిత్రబృందం పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. బడ్జెట్ లో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేకంగా కంగ్రాట్స్. చక్కటి ప్లాన్ తో ప్రతి సీన్ ను డిజైన్ చేసుకుని బాగా తెరకెక్కించాడు.” అని చిరంజీవి ప్రశంసించారు. ఇక ఇప్పటికే మహేష్‌బాబు, రామ్ చరణ్, ఎస్.ఎస్.రాజమౌళి, సుకుమార్, క్రిష్, దేవిశ్రీ ప్రసాద్ సహా పలువురు సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.