Mana Enadu: టాలీవుడ్ మాస్ మహారాజా, స్టార్ హీరో రవితేజకు ఆపరేషన్ పూర్తయింది. ఆయన కుడి చేతికి వైద్యులు సర్జరీ చేశారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వారు సూచించారు. కాగా రవితేజ తన తాజా చిత్రం ‘‘ఆర్‌టీ 75’’ షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. అయితే గాయాన్ని లెక్క చేయకుండా ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారట. ఈ క్రమంలో గాయం మరింత పెద్దగా అవడంతో డాక్టర్లు ఆయన చేతికి సర్జరీ చేశారు. కాగా ‘సామజవరగమన’ చిత్రానికి రచయితగా పని చేసిన భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న ఈ మూవీ తెరకెక్కుతోంది. హీరోయిన్‌గా తెలుగు ముద్దుగుమ్మ శ్రీలీల నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
నేను బాగానే ఉన్నా: రవితేజ
ఇదిలా ఉండగా తనకు జరిగిన శస్త్రచికిత్సపై మాస్ మహారాజా రవితేజ అప్డేట్ ఇచ్చారు. ‘శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. డిశ్ఛార్జ్ కూడా అయ్యాను. మీ అందరి ఆశీర్వాదాలు, మద్దతుకు కృతజ్ఞతలు. మళ్లీ సెట్‌లోకి వెళ్లేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నా’ అని ట్వీట్ చేశారు. మరోవైపు రవితేజ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
నిరాశపర్చిన మిస్టర్ బచ్చన్..
ఇక రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఆగస్టు 15న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. ‘రెయిడ్ అనే హిందీ సినిమా ఆధారంగా దాన్ని తెరకెక్కించారు హరీశ్ శంకర్. ఆ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా ఎట్లా ఉన్నా.. సినిమాలో పాటలు మాత్రం ప్రేక్షకులను తెగ అలరించాయి. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది.