Mana Enadu:భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. రెండు సార్లు సక్సెస్ ఫుల్ గా భూమిపైకి తీసుకువచ్చారు. కానీ మూడోసారి రోదసిలోకి వెళ్లిన ఆమె సాంకేతిక కారణాలతో రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయారు. 8 రోజుల మిషన్ పై వెళ్లిన ఆమె ఇప్పుడు 8 నెలలపాటు అక్కడే చిక్కుకుపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నట్లు నాసా ఓ ప్రకటన విడుదల చేసింది.
8 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 8 రోజుల్లో అంటే జూన్ 14న వీళ్లిద్దరు తిరిగి భూమిపైకి రావాల్సి ఉంది. అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురవ్వడం.. దాన్నింకా పరిష్కరించకపోవడంతో ఆ ఇద్దరు గత రెండు నెలలుగా అక్కడే ఉండిపోయారు.
బోయింగ్ స్టార్ లైనర్ తిరిగి భూమ్మీద ల్యాండ్ అయ్యేందుకు సురక్షితంగా లేకపోతే.. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు ఎంచుకున్న ఆప్షన్లలో ఒకటి 2025 ఫిబ్రవరిలో ఉందని తాజాగా నాసా ప్రకటించింది. అది కూడా స్పేక్స్‌ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో అని తెలిపింది. స్పేక్స్ క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను పంపించనున్నట్లు సమాచారం. సెప్టెంబరులో ఈ ప్రయోగం ఉండొచ్చని తెలిసింది. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత, విల్‌మోర్‌ను భూమ్మీదకు తీసుకురావాలని నాసా భావిస్తున్నట్లు సమాచారం.
వ్యోమగాములు స్పేస్ సెంటర్ లో సురక్షితంగానే ఉన్నారని నాసా తెలిపింది. ఎక్కువ రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉంటే వీరికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






