Mana Enadu:ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. ఈ పేరు వినగానే ఓ నియంత ముఖం అందరి మెదడులో మెదులుతూ ఉంటుంది. జాలి, దయ లేకుండా కఠిన చట్టాలు అమలు చేస్తూ.. కఠిన నిబంధనలతో ఆ దేశ ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకున్న ఓ డిక్టేటర్ కిమ్ అని ప్రపంచమంతా భావిస్తూ ఉంటుంది. తన జోలికి వస్తే అణుబాంబు వేసేందుకు కూడా ఈ నియంత వెనకడుగు వేయరు. అలా ఎప్పుడు గంభీరంగా కనిపించే కిమ్ ఇప్పుడు మారిపోయారట. కరోనా వంటి సమయంలోనూ కిమ్మనకుండా తన క్రూరత్వాన్ని చూపించిన కిమ్.. తాజాగా నార్త్ కొరియాలో వచ్చిన వరదలకు మాత్రం కాస్త కరిగిపోయారట.
ఈ వరదల వల్ల ఎంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఈ క్రమంలోనే ఆయన వరద బాధితులను ఆప్యాయంగా పలకరించారట. ప్రస్తుతం కిమ్‌కు బాధితులను పరామర్శిస్తున్న ఫొటోలు అంతర్జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నియంతగా పేరుగాంచిన కిమ్ జోంగ్ ఉన్ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోందని ఇంటర్నేషనల్ మీడియా భావిస్తోంది.
ఇటీవల ఉత్తర కొరియాలోని పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకోగా స్వయంగా వెళ్లి కిమ్.. సహాయక చర్యల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఏకంగా బోటులో వెళ్లి మరీ పరిశీలించారు. ఇక తాజాగా వరదల్లో నిరాశ్రయులైన బాధితుల్ని పరామర్శించారు. సహాయక శిబిరాలకు వెళ్లి అక్కడి సౌకర్యాలపై ఆరా తీసి పలువురు బాధితుల వద్దకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ-KCNA రిలీజ్ చేసింది.
చైనాతో సరిహద్దు ఉన్న ఉత్తరకొరియా ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా 4 వేల100 ఇళ్లు ధ్వంసం కాగా.. 7 వేల 410 ఎకరాల మేర పంటకు నష్టం వాటిల్లింది. అయితే ప్రకృతి విపత్తుతో విలవిలలాడిన ఉత్తర కొరియాకు శత్రు దేశమైన దక్షిణ కొరియా ఆపత్కాలంలో సాయం అందించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ కిమ్మనకుండా మౌనం వహించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.