CM| మల్కాజ్​గిరి ప్రజలు..గుండెల్లో పెట్టుకున్నారు!

Malkajgiri Leaders: మల్కాజ్‌గిరి పార్లమెంట్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి తనని ఢిల్లీకి పంపించారని తెలిపారు.

మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లోని 2,964 బూత్ లలో ప్రతీ బూత్ లోనూ కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్‌గిరి అని.. నాటి మల్కాజ్‌గిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందని వెల్లడించారు. కాగా కేసీఆర్ పతనం 2019 మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచే మొదలైందని స్పష్టం చేశారు.

ఇక తెలంగాణలో వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామని సీఎం తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కేవలం మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

మల్కాజ్‌గిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసునుకున్నామని సీఎం స్పష్టం చేశారు. మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రమంతా తుఫాను వచ్చినట్లు గెలిచినా మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని అన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదని పేర్కొన్నారు. అందుకే ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు.

Share post:

లేటెస్ట్