Raksha Bandhan Special : మీ తోబుట్టువులకు మీ ‘రక్ష బంధనం’గా మారుతోందా?

ManaEnadu:రాఖీ పండుగ వచ్చేసింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా అక్కాచెల్లెల్లు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. తమకు అండగా నిలవాలని కోరుకుంటారు. అన్నదమ్ములు తమ తోబుట్టువులకు బహుమతులు ఇస్తారు. జీవితాంతం తాము తోడుగా నిలుస్తామని.. రక్షగా ఉంటామని మరోసారి వాగ్దానం చేస్తారు. ఈ దృశ్యాన్ని చూస్తూ తమ పిల్లల మధ్య ఆప్యాయత అనురాగాలు ఎల్లకాలం ఇలాగే ఉండాలని తల్లిదండ్రులు ఆశీర్వదిస్తూ ఉంటారు. రాఖీ పౌర్ణమి రోజున దాదాపుగా అందరి ఇళ్లలో ఇదే దృశ్యం కనిపిస్తుంది. అయితే రక్షా బంధన్ అంటే కేవలం అన్నదమ్ములు తమ తోబుట్టువులకు రక్షగా నిలవడమేనా.. మీ రక్ష మీ తోబుట్టువులకు బంధనంగా మారుతోందా..? ఓసారి ఆలోచించండి.

రక్షా బంధన్.. అన్నదమ్ములు ఎల్లప్పుడూ తమకు రక్షగా నిలుస్తారనే నమ్మకంతో తోబుట్టువులు వారికి కట్టే ఓ బంధనం. ఈ బంధం కలకాలం నిలిచి ఉండాలని కోరుకుంటూ.. ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తామనే మాటనిస్తూ జరుపుకునే ఓ పండుగ. అక్కాచెల్లెల్లు తమ అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టి వాళ్లు పదికాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటారు.

ఇక తమ తోబుట్టువులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని సోదరులు కోరుకుంటూ వారికి బహుమతులు ఇస్తారు. అదే సమయంలో తమకు ఎల్లకాలం రక్షగా నిలుస్తామనే భరోసా కల్పిస్తారు. అయితే ప్రతిసారి తోబుట్టువులే అన్నదమ్ములకు రాఖీ కడతారు. కానీ ఈసారి మీరు కూడా మీ తోబుట్టువులకు ఓ రాఖీ కట్టండి. మీ అక్కాచెళ్లెళ్లు మిమ్మల్ని రక్షగా నిలవాలని రాఖీ కడితే.. మీరు మీ రక్ష వాళ్ల కలలకు, ఆశయాలకు ఎప్పుడూ అడ్డంకి కాదని చెబుతూ మరో రక్షను రాఖీగా కట్టండి. ఇదేంటి.. రెండు రాఖీలు అనుకుంటున్నారా.. 

మీకు తోబుట్టువులు కట్టే రాఖీ వారిని మీరు రక్షిస్తారనే నమ్మకంతో కట్టేది. కానీ మీరు వాళ్లకు కట్టే రాఖీ.. మీ రక్ష వారికి బంధనం కాకూడది. రక్ష బంధనం కావడం ఏంటని అనుకుంటున్నారా.. రక్షాబంధన్ అంటే​… కేవలం మీరు మీ తోబుట్టువులకు అండగా నిలవడమే కాదు.. వారు జీవితంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు అడ్డుపడకుండా ఉండటం కూడా మీరు వాళ్లకు కల్పించే రక్షే. ప్రతి అమ్మాయి లైఫ్ లో ఏదైనా సాధించాలనే అనుకుంటుంది. కానీ కుటుంబం, కట్టుబాట్లు, సమాజ పోకడలు వాళ్లకు అడ్డంకిగా మారుతున్నాయి. వీటితో పాటు పెళ్లికి ముందు తల్లిదండ్రులు, పెళ్లి తర్వాత భర్త చెప్పినట్లు వినడంతోనే వారి జీవితం సరిపోతోంది. అలా వారి కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి.

అందుకే ఈ రాఖీ పండుగకు.. మీ తోబుట్టువులకు మీరు అండగా నిలవండి. ఏం చేసినా నీకు నేనున్నానంటూ భరోసా కల్పించండి. ఎల్లప్పుడూ మీ మంచే కోరుకుంటూ మీకు అండగా నిలుస్తున్న ఆ ఆడబిడ్డల కలలకు మీరు అడ్డు తగలకుండా చూసుకోండి. మీ తోబుట్టువులు తాము సాధించాలన్న ఆశయం కోసం రెక్కలు కట్టుకుని ఎగరాలనుకుంటే.. వాళ్లకు ఆ రెక్కల కింద గాలిలా సపోర్టుగా నిలవండి. ఎగిరి ఎగిరి అలసిపోయి వస్తే వాలడానికి కాళ్లలా అండగా నిలవండి.

ఇలా మీ తోబుట్టువులు అనుకున్నది సాధించే ప్రయత్నంలో వాళ్లకు సపోర్టుగా మారండి కానీ అడ్డంకిగా కాదు. రక్షాబంధన్​ అంటే తోబుట్టువులకు అండగా ఉండటమే కాదు వారు సాధించాలనుకున్న వాటికి అడ్డుతగలకుండా ఉండటం కూడా. ఈ రాఖీ పౌర్ణమికి ‘మీ అక్కాచెల్లెళ్లకు మీరూ ఓ రాఖీ కట్టి మీ రక్ష వారికి బంధనం కాదు’ అని నిరూపించండి.

Share post:

లేటెస్ట్