Mana Enadu: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ మొదటికొచ్చింది. రష్యాలోని సరాటోవ్ నగరంలో భారీ భవనంపై డ్రోన్‌తో దాడి చేశారు. అయితే దీనిని ఉక్రెయిన్ మిలిటరీ చర్యగా రష్యా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ప్రతిగా ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైల్లతో విరుచుకుపడుతోంది. రెండు వందలకు పైగా డ్రోన్లు, క్షిపణలతో ఉక్రెయిన్‌పై రష్యన్ బలగాలు భీకర దాడులు చేశాయి. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, నలుగురు గాయపడ్డారు. పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. అందుకు ప్రతీకారంగా రష్యాలోని పలు ప్రాంతాలపై పెద్ద సంఖ్యలో డ్రోన్లతో ఉక్రెయిన్ బలగాలు విరుచుకుపడ్డాయి. మరోవైపు రష్యాలోని కస్క్ రీజియన్‌లో మరో రెండు గ్రామాలు తమ అధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు.
మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు
తమ దేశంలోని తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. రష్యన్ డ్రోన్లు, బహుళ క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు పలు ప్రాంతాల్లో పడినట్లు వెల్లడించింది. రాజధాని కీవ్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు పేర్కొంది. దాడులు కారణంగా కీవ్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. ప్రస్తుతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనులు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆ రెండు ప్రాంతాలు ఉక్రెయిన్ అధీనంలోకి!
మైకోలైవ్లోని నివాసిత ప్రాంతాలపై రష్యా క్షిపణుల దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు వివరించారు. ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలోని ఓ హోటల్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఓ బ్రిటిష్ పాత్రికేయుడు మరణించినట్లు ఉక్రెయిన్ ధ్రువీకరించింది. మరోవైపు రష్యాలోని కస్క్ రీజియన్‌లో మరో రెండు ప్రాంతాలు తమ అధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. తమ బలగాలు మూడు కిలోమీటర్ల దూరం దూసుకెళ్లాయని చెప్పారు. మరోవైపు రష్యాలోని సరతోవ్, యారోస్లావ్ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో 22 డ్రోన్లతో ఉక్రెయిన్ బలగాలు దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది. వీటిలో 20 డ్రోన్లను నేలకూల్చినట్లు తెలిపింది.