Mana Enadu:బంగ్లాదేశ్ రావణకాష్టంలా మారింది. అల్లరిమూకలు చెలరేగి విధ్వంసం సృష్టిస్తున్నారు. షేక్ హసీనా రాజీనామాతో అయినా అల్లర్లు తగ్గుముఖం పడతాయనుకుంటే.. హింస మరింత పెరిగిపోయింది. ఇప్పటిక జరిగిన హింసాకాండల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మాజీ ప్రధాని హసీనా దేశం వదిలి వెళ్లిన తర్వాత ఆమె పార్టీ అయిన అవామీ లీగ్ నేతలను అల్లరిమూకలు వెంటాడి వేటాడి చంపేస్తున్నారు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని అవామీ లీగ్ నేతలపై ఆందోళనకారులు అతికిరాతకంగా దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటి వరకు ఆ దేశవ్యాప్తంగా 29 మంది మృతదేహాలను గుర్తించగా.. అందులో 20 అవామీ లీగ్ నేతలవేనని స్థానిక మీడియా వెల్లడించింది.
ఆదివారం నుంచి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు అవామీ లీగ్‌తో సంబంధాలు ఉన్నవారిపై విరుచుకుపడి వెంటాడి మరీ వారిని ఊచకోత కోశారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయగానే .. ఆమె మద్దతుదారులపై దాడులకు పాల్పడి చంపేస్తున్నారు. ఈ ఘటనల్లో యువ నటుడు శాంతో, దర్శకుడైన అతడి తండ్రిని అతికిరాతకంగా హతమార్చారు. నిరసనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్‌లో నటించడం గమనార్హం.

మరోవైపు బంగ్లా ప్రజలు ప్రేమగా రాహుల్ దా అని పిలుచుకునే ప్రముఖ సంగీతకారుడు, జానపద గాయకుడు రాహుల్ ఆనందో నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మరోవైపు జషోర్ జిల్లాలో అవామీలీగ్ నేతకు చెందిన హోటల్‌కు అల్లరిమూకలు నిప్పుపెట్టిన ఘటనలో 24 మంది సజీవ దహనమయ్యారు. మూడు వారాల ఆందోళనల్లో ఇప్పటివరకు 440 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే 109 మంది మరణించారు. బంగ్లాదేశ్ లో అల్లరిమూకలు పాల్పడుతున్న హింసను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.