Mana Enadu: వచ్చే ఏడాది ఐసీసీ నిర్వహించనున్న క్రికెట్ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)పై సోషల్ మీడియాలో ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2025లో పాకిస్థాన్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్టు ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీ కోసం PCB కొత్త స్డేడియాల నిర్మాణం చేపట్టడంతోపాటు ఆయా మైదానాల్లో వసతులను చక్కదిద్దే పనిలో నిమగ్నమైంది. అందుకోసం దాదాపు 12.8 బిలియన్లు వెచ్చించనున్నట్లు ఆ దేశ బోర్డు తెలిపినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఓ విషయం మాత్రం పీసీబీని తెగ కంగారు పెడుతోంది.
ఇంతకీ అదేంటో అని అనుకుంటున్నారా.. అదే భారత్. అవునండీ బాబూ.. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు వస్తుందా? లేదా? ఒకవేళ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ పట్టుబడుతుందా? అనే ప్రశ్నలు పీసీబీకి తలెత్తుతూనే ఉన్నాయి. అవి చాలవన్నట్లు సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ విషయంపై స్పందించింది. “ఛాంపియన్స్ ట్రోఫీ తేదీలు మారబోతున్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు న్యూస్ ప్రసారం చేయడం బాధాకరం. భద్రతా పరమైన కారణాలతో టోర్నీ షెడ్యూల్ మారుస్తున్నామని, PCB చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చెప్పినట్లుగా కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అయన మాటలను వక్రీకరించారు. దీంతో వారు కావాలనే ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారు,” అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
2008ని పాక్‌లో పర్యటించని టీమ్ ఇండియా
కాగా వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 ప్రారంభం కానుంది. ఆరంభ పోరు, ఒక సెమీస్ మ్యాచ్ కరాచీలో.. రెండో సెమీఫైనల్‌కు రావల్పిండిలో జరుగుతుందని ఇటీవల పీసీబీ ప్రతిపాదిత షెడ్యూల్‌లో తెలిపింది. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మార్చిన 9న లాహోర్ వేదికగా మ్యాచ్ జరుగుతుందని పేర్కొంది. ఇదంతా సక్రమంగానే ఉన్నా.. భారత్.. పాకిస్థాన్‌కు వెళ్తుందా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు 2008 నుంచి పాకిస్థాన్‌లో పర్యటించడం లేదు.