ManaEnadu:భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఇటీవలే పారిస్ ఒలింపిక్స్‌లో 89.45 మీటర్లు తన ఈటెను విసిరి వెండి పతకాన్ని ఒడిసిపట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ఆటగాడు లుసానె డైమండ్ లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశారు. 89.49 మీటర్లు ఈటెను విసిరి రెండో స్థానంలో మెరిశాడు. ఇది ఈ సీజన్‌లోనే నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఈ సారి కూడా అతడి 90 మీటర్ల కల మాత్రం నెరవేరలేదు. ఇక లుసానె డైమండ్ లీగ్‌లో గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్లు ఈటెను విసిరి అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు. 87.08 మీటర్లతో జర్మన్ అథ్లెట్ వెబర్ జులియన్ మూడో స్థానంలో నిలిచాడు.
మొదటి రౌండ్‌లో 82.10 మీటర్లు ఈటెను విసిరి నాలుగో స్థానంలో నిలిచిన నీరజ్ ఆ తర్వాత వరుసగా 83.21 మీటర్లు, 83.13 మీటర్లు, 82.34 మీటర్లు, 85.58 మీటర్లు విసిరాడు. ఫైనల్ రౌండ్‌లో గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ జావెలిన్‌ను 90.61 మీటర్లు విసరగా, నీరజ్ చోప్రా 89.49 మీటర్లు ఈటెను విసిరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ 2022లో 89.94 మీటర్లు ఈటెను విసిరాడు. ఇప్పటి వరకు అతడి కెరీర్‌లో ఈ స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ ప్రదర్శనే అత్యుత్తమం.
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా భారత్‌కు గోల్డ్ మెడల్‌ను తీసుకువస్తాడని అంతా భావించారు. కానీ 89.45 మీటర్లు ఈటెను విసిరి వెండిని తీసుకొచ్చాడు. 2022లో 87.66 మీటర్లు ఈటెను విసిరి నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2023 డైమండ్ లీగ్‌లోనూ 89.08 మీటర్లు విసిరాడు. ఇక ఇప్పుడు ఏకంగా 89.49 మీటర్లు విసిరి అత్యుత్తమ ప్రదర్శన అందించాడు ఈ బల్లెం వీరుడు.