Mana Enadu: షకీబుల్ అల్ హసన్.. క్రికెట్ గురించి తెలిసన వారందరికీ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో ది బెస్ట్ ఆల్ రౌండర్‌గా ఈ బంగ్లాదేశ్ ప్లేయర్ ప్రసిద్ధి. అంతేకాదు ఇటీవల బంగ్లా రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశాడు షకీబ్. ఈ నేపథ్యంలోనే అవామీ లీగ్ పార్టీ తరఫున MP అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఇదిలా ఉండగా ఈ సీనియర్ క్రికెటర్‌కు తాజాగా భారీ షాక్ తగిలింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో షకీబ్ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అతడిపై మర్డర్ కేసు నమోదు అయింది.
బంగ్లాలో చెలరేగిన అల్లర్లలో రూబెల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని తండ్రి రఫీకుల్ ఇస్లామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ప్రధాని షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఇందులో షకీబ్ అల్ హసన్ 28వ నిందితుడిగా ఉన్నారు. షకీబ్‌తో పాటు ప్రముఖ బంగ్లాదేశీ నటుడు ఫెర్దూస్ అహ్మద్ 55వ నిందితుడిగా ఉన్నారు. వీరిద్దరూ బంగ్లాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందారు. అయితే, అల్లర్ల కారణంతో షేక్ హసీనా పదవికి రాజీనామా చేయడంతో ప్రభుత్వం రద్దయింది. దీంతో, వీరిద్దరూ కూడా పదవులు కోల్పోయారు.
అప్పటి నుంచి మీడియాకు దూరంగానే
బంగ్లాదేశ్‌లో అల్లర్లు, హసీనా రాజీనామా తర్వాత నుంచి షకీబ్ మీడియాకు చాలా దూరంగా ఉంటున్నాడు. అయితే కెనడా నుంచి నేరుగా పాకిస్థాన్ వెళ్లిపోయిన షకీబ్ అక్కడ తమ జట్టుతో చేరాడు. ప్రస్తుతం టెస్టు సిరీస్‌కు సంబంధించిన కీలక బాధ్యతలు చేపడుతున్నాడు.ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్, బంగ్లాదేశ్ అల్లర్ల పరిస్థితిపై ఒక్కసారి కూడా స్పందించకపోవడం కూడా విమర్శలకు దారితీసింది.
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఇలా..
కాగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కి సంబంధించి 2007లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ప్లేయర్ మొత్తం 67 మ్యాచుల్లో 5 శతకాలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 4505 రన్స్ చేశాడు. ODI కెరీర్లో 247 మ్యాచులు ఆడిన షకీబ్ 9 శతకాలతోపాటు 56 అర్ధశతకాలు బాది 7570 పరుగులు సాధించాడు. ఇక 129 T20 గేమ్స్‌లో 13 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ మొత్తం 2551 రన్స్ చేశాడు. ఇక IPLసహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని లీగ్స్‌లలో ఇతడు తన ఆటతో అలరిస్తున్నాడు.