Nepal Bus Accident:నేపాల్​లో నదిలో పడిన బస్సు.. 14 ఇండియన్ టూరిస్టులు మృతి

ManaEnadu:నేపాల్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఇటీవలే కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు సమీప నదిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. భారత పర్యటకులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. తనాహున్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారని.. వీరంతా భారతీయులేనని స్థానిక మీడియా పేర్కొంది.

అసలేం జరిగిందంటే..?

ఉత్తరప్రదేశ్‌రాష్ట్ర నంబరు ప్లేట్‌తో ఉన్న ఓ ట్రావెల్స్‌ బస్సు ఇవాళ (శుక్రవారం) ఉదయం నేపాల్‌లోని పొఖారా నుంచి కాఠ్‌మాండూ వెళ్తోంది. ఈ క్రమంలో మార్గమధ్యలో తనాహున్ జిల్లా కొండల ప్రాంతంలో అదుపు తప్పి మర్స్యాంగ్డి నదిలో పడిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల్లో ఇప్పటివరకు 16 మందిని కాపాడినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. మరో 14 మంది మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించాయి. మరో పదిమంది గల్లంతయ్యారని.. వారి కోసం ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి.

ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ రిలీఫ్‌ కమిషనర్‌ స్పందిస్తూ నేపాల్​లోని అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నట్లు చెప్పారు.  ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని బాధితుల కుటుంబాలకు చేరవేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారుంటే మెరుగైన వైద్యం అందించాలని అక్కడి అధికారులను కోరినట్లు సమాచారం.

మరోవైపు ఈ ఏడాది జూన్‌లోనూ నేపాల్‌లో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో ఏడుగురు భారతీయులు ఉన్నారు. నేపాల్​లో కొండ ప్రాంతాల్లో తరచూ ఇలా వాహనాలు అదుపుతప్పిన ప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.

Share post:

లేటెస్ట్