ManaEnadu:దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఐదు నెలలకు పైగా తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)కు మంగళవారం రోజున సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు సాయంత్రం ఆమె జైలు నుంచి విడుదలై దిల్లీలోని తన నివాసానికి వెళ్లారు. ఇక ఇవాళ మధ్యాహ్నం దిల్లీ నుంచి బయలుదేరి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) వద్ద గులాబీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కవితపై పూల వర్షం కురిపించగా.. ఆమె శ్రేణులకు అభివాదం చేశారు. పిడికిలి బిగించి విక్టరీ సింబల్ చూపిస్తూ జై తెలంగాణ అంటూ నినదించారు.
రేపు కేసీఆర్ తో కవిత సమావేశం
ఐదు నెలల తర్వాత హైదరాబాద్ చేరుకున్న కవిత వెంట బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆమె సోదరుడు కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao), భర్త అనిల్, కుమారుడు ఆదిత్య, సోదరుడు సంతోష్ కుమార్, మరికొందరు సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీగా కవిత జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకోనున్నారు. గురువారం ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి తన తండ్రి, బీఆర్ఎస్ నేత కేసీఆర్ (Former CM KCR) ను కలవనున్నారు.
ఐదు నెలల పాటు జైలులో
దిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Excise Policy Case) కేసులో మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మార్చి 26న కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అప్పటి నుంచి ఆమె తిహాడ్ జైల్లోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా.. పలు కారణాల వల్ల బెయిల్ మంజూరు కాలేదు. ఇక తాజాగా మంగళవారం రోజున సుప్రీంకోర్టు (Supreme Court) ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది. అలా అదే రోజు సాయంత్రం ఆమె జైలు నుంచి విడుదలై.. ఇవాళ దిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు.