ManaEnadu:కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావు సీఎం రేవంత్ కు సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీని దీనికి డెడ్ లైన్ పెట్టారు. అయితే ఆగస్టు 15వ తేదీ నాటికి మూడో విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు రాజీనామా చేయాలని డిమాండ్లు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో సిద్దిపేటలో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేసిందని.. హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ అర్ధరాత్రి సమయంలో కాంగ్రెస్ నేతలు పట్టణంలో ఫ్లెక్సీలు పెట్టి నినాదాలు చేశారు. వీటిని బీఆర్ఎస్ కార్యకర్తలు తొలగించేందుకు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గొడవ సద్దుమణిగించారు.
ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే పౌరుల పరిస్థితేంటి?
అయితే అనంతరం కాంగ్రెస్ శ్రేణులు హరీశ్ రావు అధికారిక నివాసంపై దాడికి తెగబడినట్లు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. అర్ధరాత్రి కాంగ్రెస్ నేతల దాడి అన్యాయానికి నిదర్శనమని .. తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. దాడిని ఆపకుండా నిందితులకు పోలీసులే రక్షణ కల్పించినట్లుందన్న హరీశ్ రావు.. ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే.. పౌరులకు భరోసా ఏదని ప్రశ్నించారు. దాడి ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రేమ బజార్ లో ద్వేష దుకాణం : కేటీఆర్
ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందిస్తూ సీనియర్ నేతకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఇలాంటి కక్ష సాధింపులు లేవని… ఇదంతా గమనిస్తున్న ప్రజలు ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరో పోస్టులో రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి.. ఇదేనా కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పు అని నిలదీశారు. ప్రేమ బజార్‌లో ద్వేషపు దుకాణం నడిపిస్తున్నారని .. రాజ్యాంగాన్ని రక్షిస్తున్నానని చెప్పుకొనే వ్యక్తికి ఇవి కనిపించడం లేదా అని కేటీఆర్ ధ్వజమెత్తారు.