ManaEnadu:దేశమంతా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటోంది. కానీ ఆ ఇంట్లో మాత్రం సందడి లేదు. చుట్టుపక్కల ఇళ్లల్లో వాళ్ల ఆడబిడ్డలు ఇంటికి వచ్చిన సంబురం కనిపిస్తోంది. కానీ ఆ ఇంటి ఆడపడుచు ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. తన స్నేహితులంతా.. అరే మా అక్క నాకు రాఖీ కట్టింది రా.. నేనేం గిఫ్ట్ ఇవ్వలేదు.. మా అక్కే నాకు గిప్ట్ ఇచ్చిందని గొప్పగా చెబుతుంటే.. ఆ కుర్రాడు కూడా మా అక్క కూడా నాకు రాఖీ కట్టిందని చేయిని చూసుకున్నాడు. ఆ క్షణం ఆ కుర్రాడికి కన్నీళ్లు ఆగలేదు. రేపు బతికుంటానో లేదో.. ఇదే నా చివరి రాఖీ చిన్నా.. ప్లీజ్ ఇప్పుడే కట్టుకో అని తన అక్క చెప్పిన మాటలు గుర్తొచ్చి గుక్కపెట్టి ఏడ్చాడు. రాఖీ పండుగ రోజు వరకు తాను బతికుంటానో లేదోనని భయపడి.. తాను లేకపోతే తన తమ్ముడికి ఎవరు రాఖీ కడతారని భావించి రెండ్రోజుల ముందే ఆ అమ్మాయి రాఖీ పండుగ జరుపుకుంది. కొన ఊపిరిలోనూ తన తమ్ముడి కోసం ఆరాటపడి.. చివరకు రాఖీ కట్టి.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే కన్నుమూసింది.
మహబూబాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామంలో తల్లీతండ్రి ఇద్దరు పిల్లలు.. కలతలు లేని ఓ చిన్న కుటుంబం నివసిస్తోంది. వారి కుమార్తె (17) కోదాడలో పాలిటెక్నిక్ చదువుతోంది. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. అందరు అక్కాతమ్ముళ్లలాగే ఆ ఇద్దరి మధ్య ఎప్పుడూ గిల్లిగజ్జాలే. కానీ తమ్ముడంటే ఆ అక్కకు ప్రాణం. అతనికీ అక్కంటే ఎనలేని ప్రేమ. మరో వారంలో రాఖీ పండుగ వస్తుందన్నప్పుడే.. అక్కా ఈసారి నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావ్ అంటూ ఆ తమ్ముడు అక్కను అడగడం మొదలుపెట్టాడు.
అరే రాఖీ కడితే అక్కకు నువ్వు గిఫ్ట్ ఇవ్వాలిరా.. అని తల్లిదండ్రులు సర్దిచెబుతుంటే.. నేను పుట్టడమే దానికి పెద్ద గిఫ్ట్ అంటూ ఆ కుర్రాడు ఆటపట్టించేవాడు. కానీ ఈ సందడి వారంలో మాయం అయిపోతుందని ఆ క్షణంలో ఆ కుటుంబం ఊహించలేదు. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులను, తమ్ముడిని బాగా చూసుకోవాలని ఆ అమ్మాయి ఎప్పుడూ ఆరాట పడుతుండేది. కానీ ఆమె ఆశను, ఆశయాన్ని ఓ ఆకతాయి చిదిమేశాడు. ప్రేమ పేరిట వేధించడంతో ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పలేక, వేధింపులు తట్టుకోలేక ఈనెల 13న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గమనించిన కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే.. ఆమెకు రాఖీ పౌర్ణమి గుర్తొచ్చింది. ఈ క్రమంలోనే శనివారం రోజున ఆ అమ్మాయి.. తన తమ్ముడికి రాఖీ కట్టాలని అనుకుంది. ‘తెల్లవారితే బతికుంటానో లేదో.. తమ్ముడికి రాఖీ కడతానమ్మా.. నేను చనిపోతే మళ్లీ ఎవరు కడతారంటూ’ తల్లిదండ్రులకు చెప్పింది. కూతురు మాట విని కన్నవాళ్ల గుండె పగిలింది. అయినా సరే ధైర్యం తెచ్చుకుంటూ.. ఏం కాదని ఆ అమ్మాయికి ధైర్యం చెబుతూ ఆమె చేత తమ్ముడికి రాఖీ కట్టించారు. అలా తన తమ్ముడికి, పెద్దనాన్న కొడుకులకు ఆ అమ్మాయి కొనఊపిరితోనే రాఖీ కట్టింది. ఆ ఆనందంతోనే కొన్ని గంటల్లోనే ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసింది.