Sudha Murthy:రక్షాబంధన్ చరిత్రపై సుధామూర్తి వీడియో.. నెట్టింట ట్రోలింగ్

ManaEnadu:దేశవ్యాప్తంగా ఇవాళ రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేళ పలువురు ప్రముఖులు తమ కుటుంబంతో జరుపుకున్న వేడుకకు సంబంధించి ఫొటోలు పోస్టు చేస్తున్నారు. వారికి వారి తోబుట్టువులతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎంపీ సుధామూర్తి కూడా నెట్టింట ఓ పోస్టు పెట్టారు. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసిన ఆమె అందులో రక్షా బంధన్ పండుగ ప్రాశస్త్యం గురించి చెప్పారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమెకు చరిత్ర తెలియదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే..?

‘‘16వ శతాబ్దంలో రాఖీ కట్టే సంప్రదాయం మొదలైంది. చితోడ్‌గఢ్‌ రాణి కర్ణావతి సామ్రాజ్యంపై  ఒక రోజు దండయాత్ర జరగడంతో ఆమె ఓ చిన్న దారాన్ని మొగల్‌ చక్రవర్తి హుమాయున్‌కు పంపించి.. తాను ప్రమాదంలో ఉన్నానని, తనను ఓ చెల్లిగా భావించి రక్షించాలని కోరింది. ఆ దారం దాని సారాంశం హుమాయున్‌కు అర్థం కాక స్థానికులను అడగ్గా.. ఇది సోదరుడి సాయం కోరుతూ సోదరి నుంచి వచ్చే పిలుపు..  ఇక్కడి సంప్రదాయం అని చక్రవర్తికి వివరించారు. దీంతో హుమాయున్‌ వెంటనే కర్ణావతికి సాయం చేసేందుకు ఆమె సామ్రాజ్యానికి బయల్దేరగా..  అప్పటికే చాలా ఆలస్యమై ఆమె ప్రాణాలు విడుస్తారు. కానీ, అప్పటి నుంచి రాఖీ సంప్రదాయం మాత్రం కొనసాగుతూ వస్తోంది.’’ అని సుధామూర్తి ఆ వీడియోలో వివరించారు.

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. చాలా మంది ఈ వివరణపై విభేదిస్తూ సుధామూర్తిని ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘ఇదంతా కల్పితం. ఆమెకు చరిత్ర గురించి ఏమీ తెలియదనుకుంటా..! అంటూ విమర్శిస్తున్నారు. రాఖీ పండగ పురాణాల కాలం నుంచి ఉందని.. మహాభారతంలో కృష్ణుడు మణికట్టుకు గాయమై రక్తం ధారగా వచ్చినప్పుడు అది చూసిన ద్రౌపది తన చీర కొంగును చించి ఆయన చేతికి కట్టగా.. అప్పుడు కృష్ణుడు.. ‘నీకు ఏ కష్టం వచ్చినా నేను రక్షగా ఉంటా’ అని ద్రౌపదికి అభయమిచ్చాడు. అలా రాఖీ పండుగ వచ్చింది”  అని కొందరు నెటిజన్లు సుధామూర్తిపై ఫైర్ అవుతున్నారు.

Share post:

లేటెస్ట్