మన ఈనాడు:తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి, పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
LPG cylinder at Rs. 500 : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి, పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పై మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళలు సబ్సిడీ సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతుండటంతో ఈ పథకంపై ప్రజల్లో ఆసక్తి ఏమిటో విదితమవుతోంది.
అయిదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలంటే ఏటా 3 నుంచి 4వేల కోట్ల రూపాయలు అవసరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడైంది.ఎల్‌పిజి సిలిండర్ రూ.500లకే అందజేస్తామన్న హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నెరవేరుస్తామని దీనికోసం అధికారులతో కసరత్తు చేస్తున్నానని మంత్రి ప్రకటించారు.
మహాలక్ష్మి పథకం కింద సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ రూ. 500 అందించే పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం త్వరలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సబ్సిడీ గ్యాస్ సిలిండరుతోపాటు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఆర్థిక సాయం పొందటానికి వీలుగా ముందుగానే మహిళలు ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాల కోసం ఎమ్మార్వో కార్యాలయాలు, ఈసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల లబ్ధి పొందటానికి వీలుగా ముందుగానే మహిళలు సర్టిఫికెట్లను పొందుతున్నారు. దీంతో ఈసేవా కేంద్రాలు, ఎమ్మార్వో కార్యాలయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. దీంతో పాటు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన నేపథ్యంలో మరికొందరు దరఖాస్తు ఎప్పుడు చేయాలని ఈసేవా కేంద్రాలకు వచ్చి అడుగుతున్నారు. మొత్తం మీద సబ్సిడీ సిలిండర్ పథకం మహిళల్లో క్రేజుగా మారింది.