ManaEnadu:హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల (Illegal Constructions) కూల్చివేతల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (Hydra) చాలా సమర్థంగా పనిచేస్తోంది. అక్రమ కట్టడాలు ముఖ్యమంత్రివైనా.. ఆయన తమ్ముడివైనా.. ఏ సినిమా హీరోవైనా.. మరో రాజకీయ నేతవైనా.. బడా వ్యాపారవేత్తవైనా వెనక్కి తగ్గడం లేదు. చెరువులపై, నాలాలపై అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు తగ్గేదేలే అంటూ బుల్డోజర్ను పంపిస్తోంది. కట్టడాలను నేలమట్టం చేస్తోంది. తాజాగా హైడ్రా రాంనగర్ (Ramnagar)పై ఫోకస్ చేసింది.
అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్లో విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించగా.. ఆ నిర్మాణాలు అక్రమమే అని వారు నిర్ధారించి రిపోర్టు అందించారు.
అంతే రిపోర్టు అందిన మరుక్షణం రంగనాథ్ కూల్చివేతకు ప్లాన్ చేశారు. సిబ్బందిని అలర్ట్ చేసి రంగంలోకి దింపారు. అలా ఇవాళ తెల్లవారుజామునే బుల్డోజర్లతో రాంనగర్ చేరుకున్నారు. అక్కడి కల్లు కాంపౌండ్‌కు చేరుకుని కల్లును పారబోసి పూర్తిగా సామగ్రిని తొలగించారు. అనంతరం కూల్చివేతలు (Hydra Demolitions) చేపట్టారు. ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సర్కారు అధికారులు ఇలా పని చేస్తే అసలు ప్రజలకు ఇబ్బందులే ఉండవని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు స్థానికులు సెల్యూట్ చేశారు.