ManaEnadu: వరద బాధితులకు అండగా నిలబడేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ (khammam district collector)ముజమ్మిల్ ఖాన్(Muzammil Khan) వినూత్న ఆలోచన చేశారు. నా ఖమ్మం కోసం నేను నిలబడతా అంటూ గణపయ్య మండపాలు బాధిత కుటుంభాలకు భరోసా నింపే సమయం వచ్చిందన్నారు.
గూగుల్ మీట్ లో జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, ఎంపీవోలు, ఏపీఎం లతో ముంపు బాధితుల సహాయ, పునరావాస చర్యలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారని పేర్కొన్నారు.
నా ఖమ్మం కోసం నేను పేరున ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.నా ఖమ్మం కోసం నేను క్రింద ప్రతి గణేష్ మండపం వద్ద ఒక బాక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా బాక్స్ లో ప్రజలు ముంపు బాధితుల సహాయార్థం దుస్తులు, చెప్పులు వంటి సామాగ్రి అందించాలని పిలుపునిచ్చారు.

దీంతో కేవలం వితరణతోనే కాకుండా, విపత్తుతో సహాయం వేళ మన ప్రజలకు మనం అండగా ఉన్నాం.. మీ వెంట ఉన్నాం.. మీ కోసం నిలబడతాం అనే భావనను బాధిత కుటుంభాలకు భరోసా ఇచ్చినట్లు అవుతుందన్నారు.
ప్రత్యేకంగా ఫ్లెక్సీ డిజైన్ చేసి ప్రతి మండపంలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సహాయ, పునరావాస చర్యలు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిపారు. 99 శాతానికి పైగా ముంపు ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చినట్లు వివరించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ఒక శాతం ప్రజలకు సేవలందించాల్సిన బాధ్యత ఉందన్నారు. దీంతో అధికారులు వచ్చే సెలవు రోజు సైతం విధులు నిర్వర్తించి, క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.






