ManaEnadu:రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో భారీ వాన పడుతోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న అత్యంత భారీ వానకు మణుగూరు(Manuguru Rains) పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మణుగూరు (Manuguru Floods) పట్టణంపై మేఘం బద్ధలైందా అన్నట్లు భారీ వర్షం కురిసి ఆ పట్టణం వరద ముంపునకు గురైంది. పట్టణంలోని సుందరయ్య నగర్, ఆదర్శనగర్, చాకలి ఐలమ్మ నగర్, పైలట్ కాలనీ, కాళీమాత ఏరియా, అశోక్ నగర్, సాయి నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు భవనాలు నీటమునిగాయి.
మరోవైపు పట్టణంలో రోడ్లపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అశోక్ నగర్లో వరద నీటిలో చిక్కుకున్న గర్భిణీ స్త్రీని, వృద్ధులను రెస్క్యూ బృందం బోటు సాయంతో వెళ్లి రక్షించింది. వరద ప్రాంతాలను పరిశీలించిన అధికారులు ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు.
మరోవైపు ఖమ్మం నగరం (Khammam Rains )లో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఓ ప్రైవేటు పాఠశాల ప్రాంగణంలోకి భారీగా వరద చేరడంతో బస్సులు నీటమునిగాయి. ఇంకోవైపు పాలేరు జలాశయానికి 40వేల క్యూసెక్కుల వరద చేరడంతో భారీగా అలుగు పారుతోంది. దీంతో ఖమ్మం-సూర్యాపేట రహదారిపై వాహనాల రాక నిలిచిపోయింది. అలుగు ప్రాంతంలో సిమెంట్ ఇటుకల పరిశ్రమను వరద చుట్టుముట్టింది. ఇంకోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.