Mana Enadu: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొలువైన శ్రీవారి దర్శనానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఏడాది పొడవునా ఈ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటూనే ఉంటుంది. నిత్యం తిరుమల మాఢవీధులు గోవింద నామస్మరణతో మార్మోగుతూనే ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే ఉంటుంది. ఆలయానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్ సైట్ ద్వారా వెల్లడిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో తిరుమల దేవస్థానం గురించి వైరల్ అవుతున్న ఓ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
వృద్ధుల దర్శనంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. రోజు వెయ్యి మంది వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తున్నాం. మూడు నెలల ముందే ప్రతినెలా 23న ఆన్‌లైన్ కోటా విడుదల చేస్తున్నాం. తిరుమలలోని నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్‌సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తాం. అని టీటీడీ స్పష్టం చేసింది భక్తులు సరైన సమాచారానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.

కొన్ని రోజుల క్రితం ఇలాగే స్వామివారికి సమర్పించే అన్నప్రసాదాల విషయంలో మార్పులు జరిగాయని, ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అన్నప్రసాదం కోసం సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. గతంలో వినియోగించిన బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని వార్త చక్కర్లు కొట్టింది. తిరుమల లడ్డూ ధరతోపాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ధర తగ్గించారంటూ ఓ ప్రచారం సాగింది. లడ్డూ ధరను రూ.50 నుంచి రూ.25కి తగ్గించారని, అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రూ.200లకు తగ్గించారంటూ ఫేక్ వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పుడు కూడా స్పందించిన టీటీడీ ఇదంతా ఫేక్ అని కొట్టిపారేసింది. ఇలా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ భక్తులను అయోమయానికి గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.






