ManaEnadu:ఈరోజుల్లో సొంత వాహనం లేనివారంటూ దాదాపుగా లేరు. బైక్ , కారు ఇలా ఏదో ఒక వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. అయితే ద్విచక్రవాహనం కంటే కారు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. ఇక కరోనా తర్వాత ప్రజా రవాణా వినియోగించడం కంటే సొంత వాహనాల కొనుగోలుకే ప్రజలు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అయితే మీరు కూడా కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఓ తీపికబురు చెప్పింది. అదేంటంటే..?
తుక్కు తెస్తే భారీ డిస్కౌంట్..
కొత్తకారు, కమర్షియల్ వెహికల్స్ కొనాలని అనుకునేవారికి కేంద్రం భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. పాత వాహనాల్ని తుక్కు కింద ఇచ్చేస్తే, కొత్త వాహనాలపై డిస్కౌంట్ ఆఫర్ (Discount On Vehicles)ను కల్పించనున్నట్లు వెల్లడించింది. వాలిడ్ డిపాజిట్ స్క్రాప్ సర్టిఫికేట్ తీసుకొచ్చినవారు కొత్త వాహనాలపై 1.5 నుంచి 3 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ను పొందచ్చని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ప్రకటించారు.
దిల్లీలోని భారత్ మండపంలో సొసైటీ ఆఫ్ ఇండియమ్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(SIAM) సీఈవోలతో సమావేశమైన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆటో మొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. కొత్త వాహనాలపై డిస్కౌంట్లు అందజేసేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించినట్లు గడ్కరీ వెల్లడించారు. డిస్కౌంట్లు అందించేందుకు అంగీకరించిన వాహన తయారీ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.
సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ తప్పనిసరి..
పాత వాహనాలను తుక్కు కింద ఇచ్చేసి ‘సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ (Certificate Of Deposit)’ను తీసుకొచ్చిన వినియోగదారులకు కొత్త కార్లపై ఎక్స్ షోరూం ధరపై 1.5 శాతం లేదా రూ.20వేలు ఏది తక్కువైతే అది అందజేస్తారన్నమాట. అశోక్ లే లాండ్ (Ashok Leyland), మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్, ఫోర్స్ వంటి కమర్షియల్ వెహికల్స్ తయారీ సంస్థలు 3.5 టన్నుల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన రవాణా వాహనాల ఎక్స్ షోరూం ధరపై 3 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నాయి.