హైదరాబాద్: ఓటర్ల సౌకర్యార్థం ఈసారి EVMలపై పార్టీ గుర్తులతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫొటో కూడా ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది.
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ వెంటనే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వపరంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ వెబ్‌సైట్లలో మంత్రుల ఫొటోలు తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అర్థం చేసుకోవాలని CEO వికాస్ రాజ్ రాజకీయ పార్టీలను కోరారు. సంక్షేమ పథకాల అమల్లో గతంలో ఉన్న నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీలు తమ ప్రకటనలకు సంబంధించి ముందుగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలి CEO సూచించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్లపై నిషేధం ఉంటుందని తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకెళ్లే వారు వాటికి సంబంధించిన పత్రాలను కచ్చితంగా చూపాలని అన్నారు. డ్రగ్స్, మద్యం, నగదు తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ రోజున వికలాంగులు (పిడబ్ల్యుడి), సీనియర్ సిటిజన్‌లకు పోలింగ్ బూత్‌లకు రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఈ ఎన్నికల్లో తొలిసారిగా సీనియర్ సిటిజన్లు, పిడబ్ల్యుడి ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు.
గరిష్టంగా ఒక పోలింగ్ స్టేషన్‌లో 1500 మంది ఓటర్లు ఉండేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. దీని కోసం పోలింగ్ కేంద్రాల సంఖ్యను కూడా పెంచుతున్నట్టు తెలిపింది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో 32,812 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఈసారి ఆ సంఖ్య 35,356కు పెరగనుంది.