తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple)లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వార దర్శనాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 10వ తేదీన ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikuntha Dwara Darshanam) ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పది రోజులపాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ 6.82 లక్షల మంది భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసిన విషయం తెలిసిందే.
రేపటి నుంచి సర్వదర్శనం
శుక్రవారం రోజున 61,142 మంది భక్తులు (Tirumala Rush) దర్శించుకోగా రూ.3.15 కోట్ల హుండీ కానుకలు లభించాయి. శనివారం సాయంత్రానికి సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. భక్తులంతా నారాయణగిరి షెడ్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం నుంచి భక్తులకు సర్వదర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు.








