Mana Enadu: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపై అపవిత్రం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయంలో ప్రసాదంగా అందించే లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆధారాలతో సహా తేల్చింది. ఈ నేపథ్యంలో తిరుమలేశుడి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఇవాళ (సెప్టెంబరు 23వ తేదీ 2024) శాంతి హోమం నిర్వహించారు. ఆలయంలో శాంతి హోమం, సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడారు.
లడ్డూపై అనుమానం వద్దు..
ఈ సందర్భంగా తిరుమల లడ్డూపై భక్తులకు ఉన్న సందేహాలన్నీ ఆయన తీర్చారు. ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. స్వామివారికి మహా నైవేద్యం పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లో సంప్రోక్షణ చేస్తున్నామని.. దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. చివరిగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని పేర్కొన్నారు.
దోషాలు తొలగిపోయేందుకే శాంతి హోమం
ఇక ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేసినట్లు తెలిపారు. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని వెల్లడించారు. లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలొద్దని భక్తులకు సూచించారు. పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం.. పవిత్రోత్సవాలతో పోయిందని చెప్పారు. మార్చిన నెయ్యితోనే ఆ తర్వాత ప్రసాదాలు తయారు చేశామని.. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం, సంప్రోక్షణతో పోతాయని వివరించారు.
దోషం తొలగింది..
ఇక అంతకుముందు జరిగిన శాంతి హోమంలో పాల్గొని టీటీడీ ఈవో శ్యామలరావు సంకల్పం చేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ కమిటీ సభ్యులు శాంతి హోమంలో పాల్గొన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, జీయర్ స్వాముల పర్యవేక్షణలో శాంతి హోమం, వాస్తు హోమం చేసిన అర్చక స్వాములు శ్రీవారిపోటులో, నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల ప్రోక్షణ నిర్వహించారు. ప్రోక్షణతో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పోటులో అన్న ప్రసాదాల తయారీ నిలిపి వేశారు. శాంతిహోమం తర్వాత అవాహన చేసుకుని ఆ దినుసులను స్వామి వారి దగ్గర పెట్టి అనంతరం కుంభ ప్రోక్షణ అర్చకులు నిర్వహించారు.