
వైవిధ్యమైన కథాంశాలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ(Vijay Antony) నటనతో పాటు సంగీత దర్శకుడిగా కూడా పేరు పొందారు. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన, 2016లో వచ్చిన ‘బిచ్చగాడు'(Bichagadu) సినిమాతో కెరీర్‌లో భారీ విజయం సాధించారు. ఆ తర్వాత 2023లో స్వీయ దర్శకత్వంలో రూపొందిన సీక్వెల్ ‘బిచ్చగాడు 2′(Bichagadu 2) కూడా మంచి హిట్‌గా నిలిచింది.
తాజాగా విజయ్ ఆంటోనీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘మార్గన్’ ది బ్లాక్ డెవిల్ జూన్ 27న(ఈ రోజు) తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. లియో జాన్‌పాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ఆసియన్ సునీల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేసింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, ఆ సందర్భంగా విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు 3’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, “’బిచ్చగాడు 3′(Bichagadu 3) సినిమాను నేను డైరెక్ట్ చేయబోతున్నాను. 2027 వేసవిలో ఈ సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం. గత రెండు భాగాలు కూడా సమ్మర్‌లో విడుదలయ్యాయి కాబట్టి, ఈ భాగాన్ని కూడా అదే టైమ్‌లో తీసుకురావాలని అనుకుంటున్నా” అని వెల్లడించారు. ఇప్పటికే రెండు భాగాలు ఘన విజయం సాధించడంతో, మూడో పార్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ‘మార్గన్’ సినిమాకి సంబంధించి, విజయ్ ఆంటోనీ ఇందులో ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. కథ ప్రకారం, ఓ సైకో స్విమ్మర్ అమ్మాయిలకు వింత డ్రగ్ ఇచ్చి హత్య చేస్తుంటాడు. ఈ కేసును చేధించే క్రమంలో ఏం జరుగుతుంది, అసలైన హంతకుడు ఎవరు అనే ప్రశ్నలకి జవాబులే ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ‘‘ఇది సాధారణ సీరియల్ కిల్లర్ సినిమా కాదు. ఇందులో అనేక లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది,’’ అని విజయ్ ఆంటోనీ తెలిపారు.
ఈ చిత్రానికి ఆయన సంగీతం కూడా అందించారు. తాను ప్రస్తుతం ఆరు నుంచి ఏడు సినిమాల్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. ‘మార్గన్’ చిత్రంతో తన సిస్టర్ కొడుకు అజయ్ ధీషన్ నటుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆయన ‘బిచ్చగాడు 2’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు.
చివరగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా తప్పక థియేటర్లో చూడండి. ఇందులోని అంశాలను ముందుగా చెప్పలేను. ‘ది బ్లాక్ డెవిల్’ అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది’’ అని పేర్కొన్నారు. ‘మార్గన్’ చిత్రానికి వస్తున్న స్పందనతో పాటు ‘బిచ్చగాడు 3’ ప్రకటన విజయ్ ఆంటోనీ అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.