
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కింగ్‌డమ్ (KINGDOM)’. ఇటీవలే ఈ చిత్ర టీజర్ రిలీజై సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను రిలీజ్ చేశారు. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక తాజాగా విడుదల చేసిన సౌండ్ ట్రాక్ విని నెటిజన్లు ఊగిపోతున్నారు. అనిరుధ్ మరోసారి తన కెరీర్ లో ది బెస్ట్ OST ఇచ్చాడంటూ కామెంట్లు పెడుతున్నారు. థియేటర్లో కింగ్‌డమ్ OST వచ్చిన ప్రతిసారి పూనకాలు రావాల్సిందేనంటూ నెటిజన్లు అంటున్నారు.
దిమ్మదిరిగే బీజీఎం
తాజాగా రిలీజ్ చేసిన సౌండ్ ట్రాక్ (Kingdom Sound Track) వీడియోలో విజువల్స్ కూడా అదిరిపోయాయి. మెస్మరైజింగ్ విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక సౌండ్ ట్రాక్ విన్న ఫ్యాన్స్ జైలర్ మూవీ తర్వాత అనిరుధ్ ఇచ్చిన బెస్ట్ బీజీఎం ఇదేనంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. గత కొన్ని రోజులుగా ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ తో పక్కా హిట్ కొడతాడంటూ ఫ్యాన్స్ అంటున్నారు.
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్
ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ లో ఎన్టీఆర్ (NTR) పవర్ ఫుల్ వాయిస్ .. గూస్ బంప్స్ తెప్పించే డైలాగులు ఈ టీజర్ కు మరింత హైప్ తీసుకొచ్చాయి. “అలసట లేని భీకర యుద్ధం అది, అలలుగా పారే ఏరుల రక్తం… వలస పోయినా, అలిసి పోయినా ఆగిపోనిది ఈ మహా రణం… నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు…. ఈ అలజడి ఎవరి కోసం, ఇంత బీభత్సం దేని కోసం… అసలు ఈ వినాశనం ఎవరి కోసం.. రణ భూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం, కాల చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.