టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ‘లస్ట్ స్టోరీస్ 2’ (Lust Stories 2) షూటింగి సమయంలో పరిచయమై.. కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. దాదాపు రెండేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట ఇటీవలే తమ ప్రేమకు బ్రేకప్ చెప్పినట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తమన్నా, విజయ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తాజాగా విజయ్ వర్మ (Vijay Varma).. ప్రేమ, రిలేషన్ షిప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అన్నింటిని ఎదుర్కోవాలి
‘‘రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్ మాదిరి ఆస్వాదించాలి. అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలరు. ఒకరితో బంధంలో ఉన్నప్పుడు.. సంతోషం, బాధ, కోపం, చిరాకు.. ఇలా ప్రతి అంశాన్ని మీరు స్వీకరిస్తూ ఇద్దరూ కలిసి ముందుకు సాగాలి. రిలేషన్‌షిప్‌లోని ప్రతి విషయాన్ని ఆనందించాలని.. ఒక బంధాన్ని సంతోషంగా మార్చుకొనే సమయంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా వాటిని ఎదుర్కోవాలని విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడే ఆనందంగా ఉన్నా
ఇక ఇటీవల తమన్నా కూడా ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “నిస్వార్థమైన ప్రేమను నేను నమ్ముతాను. ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూడటం మొదలుపెడతామో అప్పుడే అసలు సమస్యలొస్తాయి. రిలేషన్‌లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే నేను ఎక్కువగా ఆనందంగా ఉన్నాను. భాగస్వామి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.” అంటూ నేటి తరాన్ని ఆమె అలర్ట్ చేశారు.
అలా మొదలైంది
2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ కోసం తమన్నా, విజయ్ తొలిసారి కలిసి పని చేశారు. ఆ షూటింగు సమయంలోనే ఇద్దరు స్నేహితులయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. అలా ఈ జంట ముంబయి వీధుల్లో చట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వీళ్లిద్దరు చాలాసార్లు బహిరంగంగానే వ్యక్తపరిచారు. అయితే కొంతకాలంగా ఈ జంట కలిసి ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ విడిపోయారని ప్రచారం సాగుతోంది.






