కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల (Tirumala) శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు వస్తారు. అయితే మీరు కూడా ఈ నెలలో తిరుమలకు వెళ్తున్నారా? అయితే మీకో ముఖ్య గమనిక. ఈ నెలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా జనవరి 7వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమలలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి వేడుకలు (vaikunta ekadasi 2025) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 7వ తేదీ (మంగళవారం) నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే జనవరి 7వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు (VIP Break Darshan) చేసినట్లు టీటీడీ ప్రకటించింది. 6వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
ఏడాదిలో నాలుగు సార్లు
తిరుమలలో ప్రతి ఏడాది నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (koil alwar thirumanjanam) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా.. ఈ ఏడాది జనవరి 7వ తేదీ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
ఈ సమయంలో స్వామి వారి మూల విరాట్టును వస్త్రంతో కప్పి ఉంచి ఆలయ శుద్ధి పూర్తైన తర్వాత సంప్రోక్షణ చేపడతారు. అనంతరం శ్రీవారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగిస్తారు. ఆ తర్వాత వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.








