
కోలీవుడ్ స్టార్ హీరో వెలుగొందుతోన్న విశాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న తమిళ నటి సాయి ధన్షికను వివాహం చేసుకోబోతున్నట్లు విశాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ జంట ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజున, నడిగర్ సంఘం కొత్త భవనంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకోబోతోంది. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో సాయి ధన్షికను పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్. దాంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సాయి ధన్షిక గురించి నెటిజన్లలో ఆసక్తి పెరిగింది.
తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి ధన్షిక. 1989 నవంబర్ 20న తమిళనాడు రాష్ట్రం తంజావూర్‌లో జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచే నటన, మోడలింగ్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉండటంతో సినీ రంగంలో అడుగుపెట్టింది. 2006లో తమిళ చిత్రం “తిరుడి” సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది. 2009 లో పెరన్మై, 2012 లో ఆరవాన్, 2013 లో పరదేసి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇక పరదేసి మూవీలో ఆమె పాత్రకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకుంది. 2016లో విడుదలైన రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంలో ఆమె ఆయన కుమార్తె పాత్రలో నటించి విశేష ప్రశంసలు పొందింది.
ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. తెలుగులో ఆమె ‘షికారు’, ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ వంటి చిత్రాల్లో నటించింది. విభిన్న పాత్రలపై ఆసక్తి చూపే ధన్షిక, ఇటీవల ‘ఐందం వేదం’ అనే సైన్స్ ఫిక్షన్ పౌరాణిక థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించి, తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అలరించారు