మన ఈనాడు డెస్క్:నాలుగేండ్లకోసారి నిర్వహించే ఐసీసీ ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ వచ్చేసింది. ఈసారి చలికాలంలోనే మెగాటోర్నీ కాకలు పుట్టించబోతుంది. టీ20ల ప్రభావంతో వన్డేలకు కాలం చెల్లిపోయిందనే వాదనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మెగాటోర్నీపై భారీ అంచనాలు రేపాయి.
నేటి నుంచి నెలన్నర రోజుల పాటు ఫ్యాన్స్‌ను సిక్సర్ల సునామీ, వికెట్ల జడివానలో ముంచెత్తేందుకు అన్నీ జట్లు అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమయ్యాయి. తొలిసారి భారత్ ఒంటరిగా ఆతిథ్యమిస్తున్న మెగాటోర్నీకి నేడు అహ్మదాబాద్‌లో తెరలేవనుంది. గత వరల్డ్‌కప్ ఫైనలిస్టులు న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య ఆరంభ పోరు కోసం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
క్రికెట్‌ను మతంగా భావించే మన దేశంలో వన్డే వరల్డ్‌కప్ జరుగుతుండటంతో.. భారత్‌పై భారీ అంచనాలు నెలకొనగా.. 10 జట్లు.. 10 వేదికలు.. 45 రోజులు.. 48 మ్యాచ్‌లు.. 6 డబుల్ హెడర్స్‌తో ప్రపంచకప్ అగ్గి రాజేస్తున్నది. పసలేని మ్యాచ్‌లకు, బోరింగ్ సమరాలకు స్వస్తి పలుకుతూ..ఐసీసీ ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో ఉన్న ఎనిమిది జట్లను మెగాటోర్నీకి నేరుగా ఎంపిక చేయగా.. శ్రీలంక, నెదర్లాండ్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తాచాటి ముందంజ వేశాయి.మరింకెందుకు ఆలస్యం.. వన్డే మజాను ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి!
మెగాటోర్నీకి ముందు ఆరంభ వేడుకలు నిర్వహించకూడదని ఐసీసీ నిర్ణయించగా.. బుధవారమే వరల్డ్‌కప్ సారథులతో ‘కెప్టెన్స్ మీట్’ జరిగింది. రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో జరుగనున్న ఈ టోర్నీలో లీగ్ దశలో మెరుగైన ప్రదర్శన చేసిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరనున్నాయి. మెగాటోర్నీలో ఆదివారం చెన్నైలో ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో విజేతలుగా నిలిచిన టీమ్ నుంచి ప్రస్తుత భారత జట్టులో కోహ్లీ, అశ్విన్ మాత్రమే ఉండగా.. గత వరల్డ్‌కప్‌లో ఐదు శతకాలతో అదరగొట్టిన రోహిత్ శర్మ మరోసారి సేమ్ సీన్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
వీళ్లకిదే ఆఖరి చాన్స్!
ఈ తరం దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు స్టార్ క్రికెటర్లకు దాదాపు ఇదే చివరి వన్డే వరల్డ్‌కప్ కానుంది. టీమ్‌ఇండియా నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఆసీస్ నుంచి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్.. ఇంగ్లండ్ నుంచి జో రూట్, జోస్ బట్లర్.. న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ.. దక్షిణాఫ్రికా నుంచి డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్.. బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ మరో నాలుగేండ్ల తర్వాత జరిగే మెగాటోర్నీలో బరిలోకి దిగడం దాదాపు అసాధ్యమే. ఇదే చివరి మెగాటోర్నీ కావడంతో ఎలాగైనా సత్తాచాటి విశ్వ విజేతలుగా నిలువాలని వీళ్లంతా కృతనిశ్చయంతో ఉన్నారు.
1 భారత్ ఒంటరిగా వన్డే వరల్డ్‌కప్‌నకు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. 1987లో భారత్, పాకిస్థాన్ ఉమ్మడిగా వరల్డ్‌కప్ నిర్వహించగా.. 1996లో ఈ జాబితాలో శ్రీలంక కూడా చేరింది. ఇక 2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చాయి.