సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) భార్య నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా, మిస్ ఇండియా విజేతగా, ఇప్పుడు మహేష్ బాబు జీవిత భాగస్వామిగా ఆమె అందరికీ సుపరిచితురాలే.
ముంబైలో జన్మించిన నటివారసురాలు
1972 జనవరి 22న ముంబైలో జన్మించిన నమ్రత, సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టింది. ఆమె సోదరి శిల్పా శిరోద్కర్ బాలీవుడ్ చిత్రాల్లో నటించగా, వారి నానమ్మ మీనాక్షి శిరోద్కర్ ప్రముఖ మరాఠీ నటి. మీనాక్షి శిరోద్కర్ 1938లో వచ్చిన బ్రహ్మచారి అనే చిత్రంలో నటించారు.
బాలనటిగా ప్రారంభం… బ్యూటీ క్వీన్‌గా ఎదుగుదల
నటన వారసత్వాన్ని తీసుకువచ్చిన నమ్రత, మొదట బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. 1977లో వచ్చిన షిరిడీ కే సాయిబాబా సినిమాలో తొలిసారి నటించింది.. ఆ తర్వాత అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి హీరోలుగా నటించిన పూరబ్ కీ లైలా.. పశ్చిమ్ కా చేలా సినిమాతో హీరోయిన్‌గా తెరపైకి వచ్చింది.
సినిమాలకంటే ముందు నమ్రత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. 1993 లో ఈమె మిస్ ఇండియాగా ఎంపికైంది.
హిందీ నుంచి తెలుగు సినిమా వరకు…
తర్వాత బాలీవుడ్‌లో 1998లో జబ్ ప్యార్ కిస్సే హోతా హై సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నమ్రత. తెలుగు ఇండస్ట్రీలోకి ఘట్టమనేని కృష్ణ హీరోగా నటించిన వంశీ సినిమాతో అడుగు పెట్టింది. అదే సినిమా సమయంలో మహేష్ బాబుతో ఆమె ప్రేమలో పడింది. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత 2005లో పెళ్లి చేసుకున్నారు.
ప్రేమ, పెళ్లి, సినిమాలకు గుడ్‌బై
వివాహం తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగాదూరమైంది. మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. డేట్స్, మూవీస్, యాడ్స్, డ్రెస్సింగ్, వ్యాపారాలు.. ఇలా అన్ని నమ్రత శిరోద్కర్ చూసుకుంటోంది. మహేష్, నమ్రతకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు. గౌతమ్ కూడా 1 నేనొక్కడినే సినిమాలో బాలనటుడిగా నటించాడు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తరచూ ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లే నమ్రత.. అక్కడ దిగిన ఫోటోలను నెట్టింట షేర్ చేసి సందడి చేస్తుంది. తన ఇద్దరు పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. అలా తరచూ నమ్రతా శిరోద్కర్ పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.







