జీవితంలో ఏదో ఒకటి సాధించిన చాలా మంది తమ సక్సెస్ ను తల్లిదండ్రులు చూడలేకపోయారని బాధపడుతుంటారు. తాము ఎంత సాధించినా.. ప్రస్తుతం ఎంత మంచి స్థాయిలో ఉన్నా.. తలపై తల్లిదండ్రుల నీడ లేదని వాపోతుంటారు. మంచం మీద ఉన్నా సరే.. ఇంట్లో పేరెంట్స్ ఉన్నారంటే ఏదో తెలియని కొండంత ధైర్యం వస్తుంటుంది. మన నెత్తిపై ఆ దేవుడి ఆశీస్సులే ఉన్నంత భరోసా ఉంటుంది. వారి విలువ కన్నవాళ్లను కోల్పోయిన వారికే తెలుస్తుంది.
ఆ ధైర్యమే వేరప్పా
మన జీవితంలో జరిగే మంచి విషయాలు, మన లైఫ్ లో వేసే ప్రతి అడుగులో తల్లిదండ్రులు ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. అలాగే ఈ యువకుడు అనుకున్నాడు. తన ఇష్టసఖిని తల్లిదండ్రుల అనుమతితో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నాడు. ఈ విషయం కన్నవాళ్లకు కూడా చెప్పాడు. అమ్మాయి తరఫున వాళ్ల నుంచి జవాబు రావాల్సి ఉంది. కానీ ఆ యువకుడి తండ్రి ఆరోగ్యం ఇంతలోనే క్షీణించింది. అతను మరణించాడు. తల్లిదండ్రుల ఆశీస్సులతో తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ యువకుడు ఏం చేశాడంటే..?
తండ్రి అనుమతితో వివాహం
తమిళనాడులోని కడలూర్ జిల్లాలో విరుధాచలం సమీప కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్ ఓ విశ్రాంత రైల్వే ఉద్యోగి. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన రెండో కుమారుడు అప్పు న్యాయ విద్య చదువుతున్నాడు. ఈ యువకుడు విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విజయశాంతిని ప్రేమించాడు. ఇరు కుటుంబాల అనుమతితో పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.
తండ్రి మృతదేహం ఎదుటే పెళ్లి
అయితే తానొకటి తలిస్తే దేవుడొకటి తలిచాడు అన్నట్లు అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి మరణించారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఒక్కటవ్వాలనుకున్న ఆ జంటకు ఇది కోలుకోలేని దెబ్బ అయింది. అయితే ఎలాగైనా తండ్రి ఎదుటే తన ప్రేయసిని పెళ్లాడాలాని అప్పు భావించాడు. అందుకే తండ్రి అంతిమయాత్రకు ముందే ప్రియురాలిని ఒప్పించి తండ్రి మృతదేహం ఎదుట ఆమెకు తాళి కట్టాడు. పుట్టెడు దుఃఖంలోనూ అప్పు తల్లి, బంధువులు, గ్రామస్థులు వారిని ఆశీర్వదించారు. అయితే ఈ వివాహానికి అమ్మాయి తరఫువారు రాలేదు.






