
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కూటమి సర్కారుపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పవన్ పై తీవ్ర కామెంట్లు చేశారు. పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ విమర్శించారు. పవన్ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారని పేర్కొన్నారు.
ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా?
అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని వైఎస్ జగన్ (YS Jagan Press Meet) అన్నారు. ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నించారు. 175 మందిలో ఒకరికి ఇచ్చినట్టు టైమ్ ఇస్తామంటే ఎలా అని అడిగారు. సభలో ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని ఎక్కడా రూల్ లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు(Chandrababu Naidu)కు ప్రతిపక్ష హోదా తానే ఇచ్చానని.. ఎంతసేపైనా మాట్లాడమని చంద్రబాబుకు మైక్ ఇచ్చానని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు రిగ్గింగ్ చేశారని జగన్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర టీచర్ ఓటర్లు బుద్ధి చెప్పారని జగన్ వ్యాఖ్యానించారు.
అది కూడా అమలు చేయలేదు
“నిరుద్యోగులకు రూ.3 వేల భృతి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Ride For Women).. తల్లికి వందనం.. ఉద్యోగ కల్పన.. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు.. ఏడాదికి ఒక్కక్కరికి మూడు సిలిండర్లు ఇస్తామని ఇలా వివిధ రకాల హామీలు ఇచ్చిన కూటమి అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయింది. ఇప్పటికీ ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు. 50 ఏళ్లకే పింఛను ఇస్తామని చెప్పారు. అది కూడా అమలు చేయడం లేదు. నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే లేదు. ప్రతి మహిళకు సీఎం చంద్రబాబు రూ.36వేలు బాకీ పడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం చాలా చిన్నపథకం. అది కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేకపోయింది.” అని జగన్ విమర్శించారు.