‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.’ ఓ సినిమాలో తలైవా రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చం ఇదే డైలాగ్ ను కాస్త అటూ ఇటూగా మార్చి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) చెప్పారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈసారి రాష్ట్రంలో తాము సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తామని తెలిపారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌసులో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సింగిల్ గా అధికారంలోకి వస్తాం
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర (Korukanti Chandar Padayathra) చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరిఖని నుంచి చేపట్టిన ఈ యాత్ర ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందంతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాసేపు చర్చించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
కేసీఆర్ లా తయారు కావాలి
“బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయి. అట్లనే సిరిసంపదలున్న తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుంది. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మన రాష్ట్రానికి అన్యాయం జరగకూడదంటే ప్రజలంతా కేసీఆర్ లా తయారు కావాలి. నోటికొచ్చినట్లు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అందరం కలిసి ఎండగట్టాలి.” అంటూ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.






